logo

టీకా వికటించి శిశువు మృతి?

వైద్యసిబ్బంది ఇచ్చిన టీకా వికటించడంతో 45 రోజుల శిశువు మృతిచెందింది. ఈ ఘటన నూతనకల్‌ మండలంలోని యడవల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 05 Dec 2022 06:21 IST

బాలుడి మృతదేహం వద్ద రోదిస్తూ పీహెచ్‌సీ ఎదుట ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు కారింగుల రాజు, నాగమణి, బంధువులు

నూతనకల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: వైద్యసిబ్బంది ఇచ్చిన టీకా వికటించడంతో 45 రోజుల శిశువు మృతిచెందింది. ఈ ఘటన నూతనకల్‌ మండలంలోని యడవల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యడవల్లికి చెందిన కారింగుల రాజు, నాగమణి దంపతులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో కొడుకు జన్మించాడు. శనివారం యడవెల్లిలో బాలుడికి ఏఎన్‌ఎం పుష్ఫ మూడు టీకాలు వెనువెంటనే వేశారు. ఆ తర్వాత చిన్నారికి జ్వరం వచ్చింది. ఈ విషయం వైద్యసిబ్బందికి తెలిపితే సాధారణంగా జ్వరం వస్తుందని, టానిక్‌ తాగించమని చెప్పారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. టానిక్‌ తాగించినా తగ్గకపోగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆదివారం ఉదయం సూర్యాపేటకు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. ఏఎన్‌ఎం టీకా ఇవ్వడంతోనే తమ కొడుకు అస్వస్థతకు గురయ్యాడని ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పీహెచ్‌సీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన చేపట్టినా వైద్యాధికారులు స్పందించకపోవడంతో సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో తుంగతుర్తి సీఐ నాగరాజు, ఎస్సై ప్రసాద్‌ అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మండల వైద్యాధికారి నాగరాజు, ఏఎన్‌ఎం పుష్పపై కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.


మరణోత్తర పరీక్షల ప్రకారం చర్యలు
-కోటాచలం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి

సాధారణ టీకాలు వేసినట్లు సిబ్బంది తెలిపారు. శిశువుకు ఇచ్చిన టీకాలను సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపిస్తాం. మరణోత్తర పరీక్షల నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే కఠిన చర్యలు తప్పవు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల వరకు దవాఖానాలో సిబ్బంది లేకపోవడంపై విచారణ జరిపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని