logo

ఉప్పొంగిన భక్తిభావం

భగభగ మండే ఎర్రటి నిప్పుకణికలు, లయబద్ధంగా మోగుతున్న డోలు వాయిద్యాలు...శివసత్తుల నృత్యాలు..వేద మంత్రోచ్చారణలు...పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో భక్తులు అగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు.

Published : 01 Feb 2023 05:42 IST

అగ్నిగుండంలో నడిచిన భక్తులు

పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరులు

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: భగభగ మండే ఎర్రటి నిప్పుకణికలు, లయబద్ధంగా మోగుతున్న డోలు వాయిద్యాలు...శివసత్తుల నృత్యాలు..వేద మంత్రోచ్చారణలు...పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో భక్తులు అగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు. అదే సమయంలో చెర్వుగట్టు క్షేత్రంలో హరహర.. మహాదేవ.. శంభోశంకర నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేకువజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, శివసత్తులు రావడంతో క్షేత్రపరిసరాలు జన సందోహంగా మారాయి. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు నిప్పుకణికల్లో నడిచి భక్తిభావాన్ని చాటుకున్నారు. అగ్నిగుండాల్లో నడిచేందుకు శివసత్తులు, భక్తులు పోటీపడ్డారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అంతకు ముందే ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆది దంపతులను పర్వత వాహనంపై భక్తుల జయజయ ధ్వానాల నడుమ దేవస్థానం వీధుల్లో ఊరేగిస్తూ అగ్నిగుండాల వద్దకు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ మహేంద్రకుమార్‌, ఈవో నవీన్‌కుమార్‌, అర్చకులు సురేశ్‌, సతీశ్‌, నాగరాజు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిగుండంలో నడుస్తున్న వీరముష్టి వంశస్థుడు, ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ

సంప్రదాయం ప్రకారం...

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాడిపంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. ఈ సందర్భంగా వీరముష్టి వంశస్థులు ప్రత్యేకంగా పర్వత వాహనాన్ని తయారు చేసుకుని స్వామి అమ్మవార్ల ముందు నృత్యాలతో సందడి చేస్తారు. తొలుత వీరు అగ్నిగుండాల్లో నడుస్తారు. తదుపరి భక్తులు నడుస్తారు. ఈ వంశస్థుల్లోనూ వీరభద్రస్వామి పూనకం వచ్చినవారు ఇలా చేయడం ఆనవాయితీ. అగ్నిగుండాల్లో నడిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనేది భక్తులు విశ్వసిస్తారు.

నేడు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు

బుధవారం తెల్లవారుజామున దోపోత్సవం, అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్యనమస్కారాలు, దీక్షాహోమం, బలిహరణ, త్రిశూల స్నానం, క్షేత్రపాలక, కాలభైరపులకు విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం పుష్పోత్సవం, ఏకాంత సేవ పూజలు జరుపుతారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని