logo

రమ్మంటోంది.. పెద్దగట్టు

దురాజ్‌పల్లి పెద్దగట్టు వద్ద జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతర ఆదివారం ప్రారంభం కానుంది. జాతరకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 06:27 IST

సూర్యాపేట కలెక్టరేట్, చివ్వెంల, న్యూస్‌టుడే

జాతర జరిగే పెద్దగట్టు

దురాజ్‌పల్లి పెద్దగట్టు వద్ద జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతర ఆదివారం ప్రారంభం కానుంది. జాతరకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పర్యవేక్షిస్తూ.. దగ్గర ఉండి వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించారు.  


ఎక్కడికక్కడ పార్కింగ్‌..

వాహనాలు నిలిపేందుకు గట్టు సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలం

జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. గట్టు నలుమూలల నుంచి అవకాశం ఉండటంతో వారి కోసం గట్టు నలుమూలల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు  వేర్వేరుగా నిలిపేలా చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు జాతీయ రహదారి వద్ద గల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ నుంచి రామకోటి తండాకు వెళ్లేమార్గంలో పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారు.

* గరిడేపల్లి, పెన్‌పహాడ్‌ వైపు నుంచి వాహనాల కోసం కలెక్టరేట్ వెనుక భాగంలో, కోదాడ, మునగాల గుంపుల వైపు వచ్చే భక్తులకు   ఖాసీంపేట మార్గంలో, మోతె, చివ్వెంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వెంల మీదుగా మళ్లించి మున్యానాయక్‌ తండా, వీఐపీల కోసం పెద్దగట్టు తూర్పుమెట్లకు ఎదురుగా కేటాయించారు.


పిల్లలు తప్పిపోతే..

సమాచారం తెలిపేందుకు అధికారులు ఉండే ప్రాంతం

జాతరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులతోపాటు చిన్నారులు కూడా జాతరకు వస్తారు. భక్తులు అధికంగా ఉండటంతో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. తప్పిపోయిన చిన్నారుల కోసం సమాచారం ఇచ్చేందుకు మర్రిచెట్టు కింద అధికారులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. తప్పిపోయిన పిల్లల  సమాచారం ఇవ్వగానే చిన్నారుల గుర్తులతో మైకులో తెలిపేలా ఏర్పాట్లు చేశారు. పిల్లల సమాచారం తెలిస్తే పాయింట్ వద్దకు తీసుకు రావాలని సూచించేలా ఏర్పాట్లు చేశారు.


ఘర్షణలు చోటు చేసుకోకుండా..

పోలీస్‌ కంట్రోల్‌ రూం

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలంటీర్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. జాతరలో చోరీలు జరిగే ప్రమాదం ఉండటంతో దొంగలను గుర్తించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి నిమిషం నిఘా ఉండేలా గట్టు కింద మర్రిచెట్లు సమీపంలో పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్లింపు ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు.


అందుబాటులో వైద్య శిబిరం

మర్రిచెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం

జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైన ఇబ్బందులు లేకుండా ఐదు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గట్టు కింద మర్రిచెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని