logo

శోభకృత్‌ వచ్చేసింది.. ఆరు రుచులు తెచ్చేసింది

శుభకృత్‌ నామ సంవత్సరం మంగళవారంతో కాలగమనంలో కలిసిపోయింది. కొత్త ఆలోచనలు, కొంగొత్త రుచులు, శోభాయమానమైన రీతిలో ‘శోభకృత్‌’ పేరుతో తెలుగువారికి ప్రత్యేకమైన, ఇష్టమైన మరో కొత్త సంవత్సరం బుధవారం మనల్ని పలకరించింది

Published : 22 Mar 2023 04:05 IST

షడ్రుచుల సమ్మిళితమే జీవితం

శుభకృత్‌ నామ సంవత్సరం మంగళవారంతో కాలగమనంలో కలిసిపోయింది. కొత్త ఆలోచనలు, కొంగొత్త రుచులు, శోభాయమానమైన రీతిలో ‘శోభకృత్‌’ పేరుతో తెలుగువారికి ప్రత్యేకమైన, ఇష్టమైన మరో కొత్త సంవత్సరం బుధవారం మనల్ని పలకరించింది. ఏ పండగైనా సంబరాన్నే తెస్తుంది. ఉగాది రోజున వేకువజామునే లేచి నువ్వుల పిండిని శరీరానికి పూసుకుని అభ్యంగన స్నానం ఆచరించడం సంప్రదాయం. తొలుత ఉగాది పచ్చడిని సేవించి, భక్ష్యాలు తినడం, సాయంత్రం వేళ ఆలయంలోనో, గ్రామ కూడలిలోనో పురోహితుడు నిర్వహించే పంచాంగ పఠనానికి హాజరై కాల, మాన పరిస్థితులను బేరీజు వేసుకోవడం, వీలున్న ప్రాంతాల్లో కవిసమ్మేళనాలకు వెళ్లి కవులు వినిపించే కవితలను విని ఇంటికి చేరుకోవడం ఉగాది ప్రత్యేకత.


* చేదు: ప్రకృతి ప్రకోపం రైతులకు చేదు అనుభవాలనే మిగుల్చుతోంది. చెమటోడ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాల వర్షాలకు, వడగళ్ల వంటి కడగండ్లకు బలవుతుంటే రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వీటి బారిన పడకుండా మిగిలిన పంటలు చీడ,పీడలు, దళారులనుంచి తప్పించుకోలేకపోతున్నాయి.
* వగరు: తినడానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా, ఎలాగోలా మనసు చేసుకుని చక్కగా తినగలిగితే వగరు శరీరానికి మంచే చేస్తుంది. ప్రస్తుతం పరీక్షల సీజన్‌. విద్యార్థులకు కొంత ఇబ్బందికరం అనిపించినా, శ్రమించి సన్నద్ధమై ఎదుర్కొంటే భవితకు చక్కని మార్గాన్ని ఇస్తాయి.
* కారం: కారం కటువుగానే ఉంటుంది. మోతాదును మించితే దుష్ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయ నాయకులకు ఓ వైపు కార్యకర్తలనుంచి ఒత్తిడి, అధిష్ఠానం నుంచి ఒత్తిడి, సొంత పార్టీలలో ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి.. ఇలా నిత్యం ఒంటిపై కారం పూసుకున్న చందమే వారి పరిస్థితి. ఇప్పటికే కొన్ని పార్టీలు పాదయాత్రలను చేపట్టగా, మరికొన్ని పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని క్షేత్రస్థాయి నాయకత్వాలకు ఆల్టిమేటం ఇచ్చాయి.
* ఉప్పు: ఉప్పు..ముప్పు అంటారు. ఇది కూడా మోతాదులోనే ఉండాలి. లేదంటే ‘పంటికింద ఉప్పురాయిలా..’ అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి..ఈ  సంతోషంతో వాటి సాధనలో నిమగ్నమయ్యారు వారంతా. పరీక్షలు రాసే సమయానికి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నిరుద్యోగులకు నిజంగా మింగుడుపడని విషయమే.
* పులుపు: కొద్దిమోతాదు అటూ, ఇటు అయినా భరించకతప్పని పరిస్థితి ఇది. ధరల పెరుగుదల నిజంగా పులుపునకు వర్తిస్తుంది. బంగారం, వెండి, పెట్రో ఉత్పత్తులు, గ్యాస్‌, విద్యుత్తు, సిమెంటు, ఐరన్‌ తదితర ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అయినా ఏదో విధంగా ఎంతోకొంత వెసులుబాటు చేసుకుని కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. వివాహాది శుభకార్యాలు చేసేవారు బంగారం, వెండి కొనాల్సిందే. ఇల్లులేని వారు చిన్నపాటి ఇంటి నిర్మాణం అయినా చేపట్టాల్సిందే. భారం అయినా మోయక జనానికి తప్పడంలేదు.
* తీపి: ఇప్పటికే కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు దళితబంధు, రుణమాఫీ, రెండు పడకగదుల ఇళ్ల పంపిణీకి చర్యలు, గృహలక్ష్మి వంటి కొత్త పథకాలు ప్రజలకు కొంత తీపిని పంచేవే. సీఎం ప్రకటనలను బట్టి చూస్తే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలు కూడా ప్రజలకు తీపికబురును అందించేవే.


ప్రస్తుత పరిస్థితుల్లో షడ్రుచుల తీరు ఇదీ..

మనిషి జీవితం కష్ట, సుఖాల సమ్మిళితం అని చెప్పడానికి షడ్రుచులతో కూడిన ‘ఉగాది పచ్చడి’తో మొదలవుతుంది. ఈ ఆరు రుచులు, వాటి లక్షణాలు ఇలా.. పులుపు- ఆమ్లం, తీపి-మధురం, వగరు- కషాయం, చేదు-పిత్తం, కారం- కటువు, ఉప్పు- లవణం ఉంటాయి. అందుకే ఉగాది పచ్చడిలో ఆరు రుచుల ఆస్వాదన కోసం వేపపువ్వు, లేత మామిడికాయ, బెల్లం, కొత్తగా వచ్చిన చింతపండు, ఉప్పు, కారం వినియోగిస్తారు.

కవి సమ్మేళనం

ఉగాదికి, మాతృభాషకు, కవి సమ్మేళనానికి సంబంధం ఉంది. ఉగాది సమయంలో కొత్త చివుళ్లు తిని శ్రావ్యంగా కూసే కోకిల పాటలు కవుల మనసుల్లో కొత్త ఆలోచనలను కలిగిస్తుంటాయి. తెలుగుభాష మాధుర్యాన్ని చాటడానికి కవి సమ్మేళనాలు ఒక చక్కటి వేదిక. దేశ, జనం హితం కోరుతూ వారు కవితలను అల్లి ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసే కవి సమ్మేళనాల్లో వినిపిస్తుంటారు. ఇలాంటి సమ్మేళనాలకు చిన్నారులను తీసుకెళ్లడం ద్వారా వారిలో తెలుగుభాష పట్ల మమకారాన్ని, కవిత్వ రచనపట్ల ఆసక్తిని పెంచడానికి వీలుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని