logo

సమీపిస్తున్న గడువు

జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయి పడిన మిల్లర్లు మరో 15 రోజుల్లో వాటిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 24 Mar 2023 04:44 IST

సీఎంఆర్‌ లక్ష్యాల పూర్తిపై అధికారుల కసరత్తు

సూర్యాపేట: కలెక్టరేట్లో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయి పడిన మిల్లర్లు మరో 15 రోజుల్లో వాటిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సీజన్లకు సంబంధించి బకాయి ఉండకూడదని, గడువు లోపు అందించకుంటే సంబంధిత మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెడతామని జిల్లా పాలనాధికారి ఇటీవల జరిగిన సమావేశంలో హెచ్చరించారు. 2021-22 వానాకాలం, యాసంగి, 2022-23 వానాకాలానికి సంబంధించి సీఎంఆర్‌ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో బకాయి ఉన్న మిల్లుల వివరాలు సేకరిస్తున్నారు. తక్షణమే బియ్యం అప్పగించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత అందించారు.. ఇంకా ఎంత అందించాల్సి ఉంది, తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో మూడు సీజన్లకు సంబంధించి మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్లు బకాయి పడ్డారు.

నెలాఖరు లోగా లక్ష్యం చేరుకోవడంపై కసరత్తు

రైస్‌ మిల్లర్లు నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉంది. ఆలోపు లక్ష్యం చేరేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం అందించిన మూడు నెలల్లోపే బియ్యంగా మార్చి అందించాల్సి ఉంది. కానీ కొందరు మిల్లర్లు ఆ ధాన్యంతో వ్యాపారం చేస్తూ బియ్యం అప్పగింతలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. మరో అవకాశం కల్పించి గడువు పొడిగించడంతో ఇప్పటికైనా లక్ష్యం అందుకొని బకాయిలు పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు పాటుపడుతున్నారు ఇటీవల సూర్యాపేటలో కలెక్టర్‌ మిల్లర్లతో సమావేశంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. గడువులోగా బకాయిలు పూర్తి చేయకుంటే మిల్లులకు రావాల్సిన కమీషన్‌, బిల్లులను నిలిపివేయడంతోపాటు బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.

బకాయిలు ఇలా..

జిల్లాలో 2021-22 వానాకాలం, యాసంగి సీజన్‌ నుంచి సీఎంఆర్‌ బకాయి ఉన్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్థానికంగా రైసుమిల్లులకు తరలిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లరు మరాడించి క్వింటాలుకు 67 కిలోల చొప్పున బియ్యం పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలి. క్వింటాలు రా రైస్‌ మర పట్టిస్తే రూ.15, బాయిల్డ్‌ రైస్‌ అయితే రూ.25 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే మూడు సీజన్లకు కలిపి తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద జిల్లాలో 75 రైస్‌ మిల్లులకు కేటాయించారు. ఆయా మిల్లులు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు అందులో సగమే అందించాయి. మరో 3 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉండటంతో అధికారులు సీఎంఆర్‌ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2022-23 వానాకాలం సంబంధించి సీఎంఆర్‌కు గడువు పొడిగించే అవకాశం ఉంది. కాగా, తాము అందించే ప్రతి బియ్యం గింజను ఎఫ్‌సీఐ సిబ్బంది పరిశీలిస్తున్నారని, కొంచెం నల్లబారినా తీసుకోవడం లేదని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రవాణా భారం, కూలీల ఖర్చు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


లక్ష్యాన్ని పూర్తి చేస్తాం: మోహన్‌రావు, అదనపు కలెక్టర్‌, సూర్యాపేట

ప్రభుత్వ మిల్లర్లకు ఇచ్చిన గడువు ప్రకారం సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశానుసారం మిల్లర్ల బకాయి వివరాలను తెలుసుకుంటున్నాం. బకాయి ఉంటే ఉన్నతాధికారుల సూచనల ప్రకారం మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని