logo

రాచబాటలో సమస్యల మేట

విస్తరించిన 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చేయాల్సిన పనులు నేటికీ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 30 Mar 2023 04:38 IST

ఇబ్బందుల్లో వాహన చోదకులు, గ్రామీణులు

కేతేపల్లి శివారులో అర్ధాంతరంగా నిలిపివేసిన డ్రైనేజీ కాలువ

కేతేపల్లి, న్యూస్‌టుడే: విస్తరించిన 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చేయాల్సిన పనులు నేటికీ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులోని నకిరేకల్‌ బైపాస్‌ జంక్షన్‌ వద్ద అండర్‌ నిర్మించాలని ప్రతిపాదించినా ఆచరణలోకి రాలేదు. మల్లన్నగుట్ల వద్ద ప్రమాదకర కూడలిలో అండర్‌పాస్‌ నిర్మించాలని స్థానికులు పదేళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొర్లపహాడ్‌, కేతేపల్లి, చీకటిగూడెం, ఉప్పలపహాడ్‌ గ్రామాల బస్‌స్టేజీల వద్ద జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రాచబాటలో ప్రతిపాదించిన గ్రామాలలో సర్వీసు రోడ్ల వెంట డ్రైనేజీలను అవసరమైన చోట నిర్మించలేదు. గ్రామాలలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో వానలు వచ్చిన ప్రతిసారీ ఇళ్లముందు వర్షపు నీరు నిలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇబ్బంది

ఉమ్మడి జిల్లాలో చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, నకిరేకల్‌, కేతేపల్లి, సూర్యాపేట, చివ్వెంల, మునగాల, నడిగూడెం, కోదాడ మండలాల్లోని 31 గ్రామాల్లో సర్వీసు దారులు ఉన్నాయి. వాటివెంట  డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు చేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఆందోళనలు చేస్తే సంబంధిత అధికారులు, గుత్తేదారులు హామీలు ఇస్తున్నారే తప్ప పనులు మాత్రం చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని సుమారు పద్దెనిమిది గ్రామాల్లో సర్వీసు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. సర్వీసుదారుల ఉన్న బస్‌షెల్టర్‌లు పల్లెలకు దూరంగా ఉండటంతో అవికూడా నిరుపయోగంగా ఉన్నాయి.


పట్టించుకునే వారు లేరు

చెనగోని వెంకన్నగౌడ్‌, ఇనుపాముల

జాతీయ రహదారి విస్తరణ సమయంలో ప్రభుత్వం, అధికారులు అనేక హామీలు ఇచ్చారు. రహదారి విస్తరణలో స్థానికంగా చేయాల్సి పనులు సూచించాలని గుత్తేదారు సంస్థ, జాతీయరహదారుల అభివృద్ధి సంస్థ వారు కోరారు. వారి సూచనల మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇంజినీరింగ్‌ నిపుణుల సహకారంతో అందజేశాం. అయినా పట్టించుకునేవారు లేరు. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.


మంజూరైతే పనులు చేస్తాం

శ్రీధర్‌రెడ్డి, జీఎమ్మార్‌ అధికారి

జాతీయ రహదారి విస్తరణలో గ్రామాలలో ప్రజలకు అవసరమైన పనులకు ప్రతిపాదనలను ఎన్‌హెచ్‌ఐ అదికారులతో కలిసి మా సంస్థ ప్రతిపాదించింది. ఆయా పనులు జాతీయ రహదారుల విభాగం వారు మంజూరు చేయగానే ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని