logo

కిస్తీ.. కుస్తీ..!

 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ల అప్పులు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. గ్రామాల్లో సేవలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీలకు మూడేళ్ల క్రితం బ్యాంకు రుణాల ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించింది.

Published : 31 May 2023 05:19 IST

గ్రామపంచాయతీ ట్రాక్టర్‌

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ల అప్పులు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. గ్రామాల్లో సేవలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీలకు మూడేళ్ల క్రితం బ్యాంకు రుణాల ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించింది. ఒక్కో పంచాయతీ రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలతో ట్రాక్టర్‌, ట్రాలీ, నీటి ట్యాంకర్‌ సమకూర్చుకున్నాయి. సొంత ఆదాయ వనరులు లేకపోవడంతో పాటు నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 134 గ్రామపంచాయతీలు నెలనెలా బ్యాంకులకు కిస్తీలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పటికే నిర్వహణ భారం సర్పంచులు, కార్యదర్శులపై పడుతుండగా.. ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపు వీరికి మరో తలనొప్పిగా మారింది.

ఇదీ పరిస్థితి..

ట్రాక్టర్లు కొనుగోలు చేయకముందు పలు పంచాయతీలు ట్రైసైకిళ్లు, అద్దె వాహనాలతో పనులు చక్కదిద్దేవారు. అప్పట్లో చెత్త సేకరణతో పాటు కొన్ని సందర్భాల్లో నీటి సరఫరా అవసరం అయ్యేది. ప్రస్తుతం పల్లె ప్రగతితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుండటంతో సొంత వాహనాలు అవసరమయ్యాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటెషన్‌, హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో పాటు పలు పనుల కోసం గ్రామపాలకులు ట్రాక్టర్లను నిరంతరంగా వినియోగిస్తున్నారు. ప్రతి పంచాయతీ ట్రాక్టర్ల డీజిల్‌ కోసం పంచాయతీ పరిధిని బట్టి ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. దీనికి తోడు మరమ్మతులకు వస్తున్నాయి. అప్పు చేసి బాగు చేయించాల్సి వస్తుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈఎంఐ ప్రభుత్వమే చెల్లించాలి..
ఎలిమినేటి కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం, జిల్లా ప్రధాన కార్యదర్శి

బకాయిపడిన ట్రాక్టర్ల ఈఎంఐలు ప్రభుత్వం చెల్లించి గ్రామపంచాయతీలను ఆదుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా ఇవ్వాల్సిన నిధులు జమకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి ఒక్క పైసా ఇవ్వలేదు. నిర్వహణకు గత్యంతరం లేక అప్పులు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఆదాయ వనరులు లేని గ్రామపంచాయతీల పరిస్థితి దారుణంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని