logo

చేప పిల్లల పెంపకానికి సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు, మత్స్యకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా చేపపిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు బాటలు వేస్తోంది.

Updated : 04 Jun 2023 05:19 IST

చేపలు పడుతున్న మత్స్యకారులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు, మత్స్యకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా చేపపిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు బాటలు వేస్తోంది. ఈ ఏడాది కూడా జిల్లాలో రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను పెంచేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 3141 చెరువులు, 12 రిజర్వాయర్లలో ఈ ఏడాది 14.13 కోట్ల చేపపిల్లలను వదులనున్నారు. నల్గొండ జిల్లాలో 9 రిజర్వాయర్లు, 1,341 చెరువుల్లో 6.15 కోట్ల చేపపిల్లలను పెంచడానికి ప్రణాళిక రచించారు. చెరువుల్లో 35 ఎం.ఎం నుంచి 40 ఎం.ఎం, జలాశయాల్లో 87 నుంచి 100 ఎం.ఎం పరిమాణం కలిగిన చేపపిల్లలను వదులుతారు. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగి.. ధరలు అందుబాటులో ఉండే రాహు, బంగారు తీగ, బొచ్చె లాంటి రకాల చేపలను పెంచనున్నారు.

ఆన్‌లైన్‌ టెండరు..

ఉచిత చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం టెండర్లు పిలిచారు. ఆన్‌లైన్‌ టెండర్ల ప్రక్రియ గత నెల 31న పూర్తయింది. గుత్తేదారుల ఎంపిక ఈ నెల 20వ తేదీ వరకు సాగుతుంది. టెండర్లు పూర్తయ్యాక చేపపిల్లల ఉత్పత్తి క్షేత్రాలను పరిశీలిస్తారు. విత్తన రకాలు, వాటి పరిమాణం, నాణ్యత బాగుంటే ధర నిర్ణయించి ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత పంపిణీ చేపడతారు. ఈ ప్రక్రియ నెల రోజుల వరకు జరుగుతుంది. జులై రెండో వారంలో చేపలను చెరువుల్లో వదిలే అవకాశం ఉంది.

మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి..

జిల్లాకు అవసరమైన ఉచిత చేపపిల్లల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆన్‌లైన్‌ టెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు. ఈ పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వెంకయ్య, మత్స్యశాఖ జిల్లా అధికారి, నల్గొండ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని