logo

గ్రామాల్లో డ్రోన్‌ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Published : 28 Mar 2024 05:18 IST

పాచిల్ల గ్రామంలోని జనావాసాల పై నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని పోలిన డ్రోన్‌

గుండాల, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రం నుంచి మోత్కురుకు వెళ్లే ప్రధాన రహదారిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి డ్రోన్లు చిన్న తరహా విమానాన్ని పోలినవి భారీ శబ్దం చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా గత నెలరోజులుగా తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. ఇదే వ్యవసాయ క్షేత్రం నుంచి 2022 అక్టోబరు 4న ఎగిరిన డ్రోన్‌ రామారం గ్రామంలోని గుండ్లపల్లి రాంరెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద ఆ రైతు పశువులను మేపుతుండగా కూలిపోయింది. రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది రోజులు డ్రోన్లు ఎగరవేయడం నిలిపివేసినా మళ్లీ కొనసాగుతోంది. డ్రోన్లు ఎందుకు తయారు చేస్తున్నారో, ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారో తెలియడం లేదని,  పొరపాటున గతంలో మాదిరి వ్యవసాయ క్షేత్రాలు, జనావాసాలపై కూలితే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రంలోని తయారీ దశలో ఉన్న డ్రోన్‌ పరికరం

ఈ విషయమై తహసీల్దార్‌ జలకుమారిని వివరణ కోరగా.. డ్రోన్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు అందలేదని,  ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి అని,  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాల ఎస్సై యాకన్నను వివరణ కోరగా.. డ్రోన్ల తయారీ కోసం దరఖాస్తు చేసినట్లు నిర్వాహకులు తెలిపారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని