logo

పోరు.. ఖరారు..!

నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

Published : 29 Mar 2024 02:36 IST

నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది.దీంతో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలు, పంటలు ఎండిపోతుండటంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని భారాస నిర్ణయించింది. గత పదేళ్ల భారాస పాలనతో పాటూ ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలోనూ ప్రజలకు ఏమీ ఒనగూరలేదని చెబుతూ..కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ సుస్థిర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా భాజపా ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఈనాడు, నల్గొండ


బలమైన పోటీ ఇచ్చేలా.. భారాస

అధికారంలో కోల్పోవడంతో డీలా పడ్డ కార్యకర్తలను తిరిగి లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా భారాస ఎత్తుగడలు వేస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండు జనరల్‌ స్థానాల్లో ఒకటి బీసీకి, ఒకటి ఓసీకి కేటాయించిన పార్టీ నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నుంచి క్యామ మల్లేష్‌లను బరిలోకి దింపింది.  ఒకట్రెండు రోజుల్లో మాజీ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించినా.. ఇప్పటివరకు రూట్‌మ్యాప్‌ ఖరారు కాలేదు. దీంతో వచ్చే నెల మొదటివారంలో పార్టీ అధినేత పర్యటన ఉండొచ్చని సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఆ కార్యక్రమం నుంచే ప్రచార కార్యక్రమాలకు తెర తీయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నల్గొండ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కంచర్ల కృష్ణారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కలిసి తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న క్యామ మల్లేష్‌ త్వరలోనే నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంటుల్లో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.


సిట్టింగులను నిలబెట్టుకునేలా..కాంగ్రెస్‌

రెండు సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది. నల్గొండ లోక్‌సభ స్థానానికి సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డిని ప్రకటించగా.. భువనగిరి స్థానానికి సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. నల్గొండ స్థానంలో ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకు లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఈ నెల 30న మట్టపల్లిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి కోమటిరెడ్డితో పాటూ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. అభ్యర్థిగా ఎంపికైన రఘువీర్‌రెడ్డి ఇప్పటికే  నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సీనియర్‌ నేత జానారెడ్డి సైతం ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను కలిసి తన కుమారుడికి మద్దతివ్వాలని కోరారు. భువనగిరిలో అభ్యర్థి ఎంపికలో కొంత జాప్యం జరిగినందునా.. ఒకట్రెండు రోజుల్లో ఈ స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


కేంద్ర పథకాలు, మోదీ ప్రభతో..భాజపా

భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను భాజపా బరిలోకి దింపడంతో ఆయన పది రోజుల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఉండటం, ఒక దఫా ఎంపీగా గెలుపొందడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఓట్లు అడుగుతున్నారు. నల్గొండ నుంచి అనూహ్యంగా టిక్కెట్‌ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలోని వివిధ వర్గాలతో సమావేశం అవుతూ భాజపాకు ఓటేయాలని కోరుతున్నారు. తాజాగా నల్గొండలో సామాజిక మాధ్యమాల కార్యకర్తలతో పాటూ సీనియర్‌నేతతో సమావేశమై గెలుపు వ్యూహాలను చర్చించారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని