logo

e-స్మార్ట్‌ వేదిక..రైతులకు వేడుక

వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న ఈ-నాం తరహాలో క్షేత్రస్థాయిలో ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏపీ ఫార్మర్స్‌ ఈ-విక్రయ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆన్‌లైన్‌ వేదికగా రైతుల వద్దే ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడానికి నిర్ణీత

Published : 24 Jan 2022 06:12 IST

పంట ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ వ్యాపారం

రైతులు పండించిన ఉత్పత్తులు

వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న ఈ-నాం తరహాలో క్షేత్రస్థాయిలో ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏపీ ఫార్మర్స్‌ ఈ-విక్రయ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆన్‌లైన్‌ వేదికగా రైతుల వద్దే ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడానికి నిర్ణీత ధరలు అందుబాటులో ఉంచనున్నారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల మధ్య వారధిగా ఈ కార్పొరేషన్‌ వ్యవహరించనుంది. దిగుబడులకు ఎక్కడ గిరాకీ ఉందో గుర్తించి అక్కడకు సరఫరా చేసి గిట్టుబాటు ధర తీసుకొచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందుకు రాష్ట్ర ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలో కార్యాచరణ చేపట్టనుండగా ఉద్యాన రైతులకు ఇది చాలా వరకు మేలు చేయనుంది.

న్యూస్‌టుడే, గూడూరు జిల్లాలో 73,080 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటల సాగు జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో పప్పులు, పండ్లు, కూరగాయలు, మసాల దినుసులు, నూనె గింజల సాగు చేపడుతున్నారు. పంటల దిగుబడి సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. దళారీ వ్యవస్థ రంగంలోకి దిగి ధరలను దిగ్గోస్తోంది. కూరగాయల ధరల పరిస్థితీ ఇదే. రైతు వద్ద తక్కువకు కొనుగోలు చేసి మార్కెట్లో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ నేరుగా రైతులే మార్కెట్‌కు తీసుకొచ్చినా గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా.. నగదు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికక్కడే విక్రయించుకోవడానికి ఓ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఓ యాప్‌ను తీసుకురానున్నారు. ఉత్పత్తుల వివరాలు ఆన్‌లైన్‌లో చేరగానే కొనుగోలుదారులు నేరుగా ఇక్కడికొచ్చే తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ-నాం పోర్టల్‌ మండీల స్థాయిలో పనిచేస్తోంది. జిల్లాలోని పొదలకూరు నిమ్మకాయల మార్కెట్‌ కూడా దీనికి అనుసంధానమైంది. తద్వారా ధరలు తెలుసుకొని మంచి ధరలు పొందుతున్నారు. ఇదే తీరుగా ఎక్కడెక్కడ ధరలెలా ఉన్నాయో రైతులు తెలుసుకొని విక్రయించుకోవచ్ఛు చెల్లింపులు పారదర్శకంగా సాగనున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ధరల కన్నా తక్కువకు ఉత్పత్తులు విక్రయించడానికి అవకాశం లేకుండా ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పనిచేస్తుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా దీన్ని తీర్చదిద్దనున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. ఎక్కడికైనా సరకు తీసుకెళ్లడానికి ట్రాన్స్‌పోర్టర్లను అనుసంధానం చేయనున్నారు.

రైతు శ్రమకు తగిన ఫలితం

- ప్రదీప్‌కుమార్‌, ఉద్యాన శాఖాధికారి, నెల్లూరు

ఉద్యాన పంటల సాగు చేసే రైతులకు ఆన్‌లైన్‌ వేదిక మంచి ధరలు లభించేలా చేస్తుంది. రైతులు, వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ ఉండదు. ఫలితంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు తక్కువ ధరకే అన్ని అందుబాటులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని