logo

నగరయాతన

నగరవాసం ప్రజలకు పరీక్ష పెట్టింది. నగర జీవికి గురువారం నరకం కనిపించింది. కొద్దిపాటి వర్షానికే సింహపురి మడుగును తలపించగా- ప్రధాన రహదారులతో పాటు రైల్వే అండర్‌ పాస్‌ల వద్ద భారీగా నీరు చేరి జనజీవనం స్తంభించింది. పేరుగొప్ప

Updated : 05 Aug 2022 05:13 IST

కొద్దిపాటి వర్షానికే జలమయం

 ట్రాఫిక్‌ చిక్కులతో ప్రజల సతమతం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

మాగుంట లేఅవుట్‌ వద్ద పరిస్థితి

నగరవాసం ప్రజలకు పరీక్ష పెట్టింది. నగర జీవికి గురువారం నరకం కనిపించింది. కొద్దిపాటి వర్షానికే సింహపురి మడుగును తలపించగా- ప్రధాన రహదారులతో పాటు రైల్వే అండర్‌ పాస్‌ల వద్ద భారీగా నీరు చేరి జనజీవనం స్తంభించింది. పేరుగొప్ప ప్రకటనలతో సరిపుచ్చుతున్న నాయకగణం మాటల్లోని డొల్లతనానికి.. యంత్రాంగం నిష్క్రియాపరత్వానికి మౌనసాక్షిగా నిలిచింది. వర్షపునీటి మడుగులకు తోడు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయి.. వాహనదారులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులపై నగరానికి వచ్చేవారు.. బయటకు వెళ్లేవారు.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందరూ ఒక్కటై.. విస్తృత ప్రయోజనమే లక్ష్యంగా దిద్దుబాటుకు దిగాలన్న మాట బలంగా వినిపించింది.

నెల్లూరు.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 54 డివిజన్లు.. పది లక్షల మంది జనాభా ఉన్న నగరం చిరు జల్లులకే చిగురుటాకులా వణికిపోయింది. గురువారం కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా ఆత్మకూరు బస్టాండు, విజయమహాల్‌ గేటు, మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జిల్లో చేరిన వర్షపునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో.. నగరంలోని తూర్పు, పడమరలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు అడుగులకు పైగా నీరు నిలవడంతో.. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ మార్గం నుంచే వెళ్లాల్సిన గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల బస్సులు, ఇతర వాహనాలతో కి.మీ. మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పెన్నా వంతెన వాహనాలతో కిక్కిరిసిపోయింది. రంగనాయకులపేట, కొండాయపాళెం గేటు మీదుగా నగరంలోకి వచ్చేందుకు యత్నించిన వారికి రైళ్ల రాకపోకలతో నరకం కనిపించింది. వెంకటేశ్వరపురం దగ్గర నుంచి శెట్టిగుంట రోడ్డు వరకు నిలిచిపోవడంతో వాహనాలను జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఉదయం 8 గంటలకు బయటకు వచ్చిన జనం.. 11.30 గంటల వరకు ట్రాఫిక్‌లో పడిగాపులు కాయల్సి వచ్చింది. కొందరు వాహనదారులు.. అత్యవసర పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.30 గంటల వరకు ట్రాఫిక్‌లో ప్రజలు చిక్కుకుపోయారు.
శాశ్వత చర్యలేవీ?
నెల్లూరు నగరంలో 2015లో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం ముంపునకు గురైంది. సుమారు రూ. 14.32 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పది రోజుల పాటు ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అప్పటి ముఖ్యమంత్రి మూడు రోజులపాటు నగరంలో ఉండి.. పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించడంతో.. రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌ ప్రాంతాల్లో ఆర్‌వోబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. అవి ఇప్పటికీ పత్రాలు దాటలేదు. ప్రజల కష్టాలు తీరలేదు.

రామలింగాపురం అండర్‌ బ్రిడ్జి వద్ద ప్రజల, విద్యార్థుల అవస్థలు

వాహనాలు వదిలి పరుగులు
ఇంటర్‌ సప్లిమెంటరీ, డిగ్రీ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు.. ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. సమస్య తీరేలా కనిపించకపోవడంతో.. వాహనాలు దిగి పరుగులు తీశారు. పెన్నా వంతెనపై బస్సుల్లో చిక్కుకున్న విద్యార్థులు రైల్వేస్టేషన్‌ వరకు వచ్చి.. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో కేంద్రాలకు చేరుకున్నారు.

అధికారుల అలసత్వం..
నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అలసత్వం నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. నగరంలోని మాగుంట లేఅవుట్‌, రామలింగాపురం, విజయమహల్‌గేటు అండర్‌ బ్రిడ్జిల వద్ద వర్షపు నీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు లేకపోయినా పనిజరిగేలా జనరేటరు సౌకర్యం కల్పించేందుకు సిబ్బందిని నియమించారు. వర్షం కురిసి వంతెనల కింద నీరు చేరినా.. సకాలంలో వారు స్పందించలేదు. దీంతో ట్రాఫిక్‌ చిక్కులను అధికం చేసింది.
నెల్లూరులో అత్యధికం
గురువారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం ప్రకారం.. నెల్లూరు గ్రామీణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 38 మండలాల్లో.. 23 మండలాల్లో వర్షం కురిసింది. నెల్లూరు రూరల్‌లో 72.4 మి.మీ.లు కాగా, కోవూరులో 65.8, నెల్లూరు పట్టణంలో 60 మి.మీ. నమోదైంది. అత్యల్పంగా ఉదయగిరిలో 1.2 మి.మి. కురిసింది.
అదుపుచేసే వారేరీ!
ట్రాఫిక్‌ నియంత్రణలో ప్రణాళికా లోపం.. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం దూసుకువెళ్లడం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమైంది. అక్కడక్కడా ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నా.. తమవల్ల గాక చేతులెత్తేయడం పరిస్థితికి అద్దం పట్టింది. అదే సమయంలో విధుల్లో లేకపోయినా.. కొందరు చొరవతో ముందుకొచ్చి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు యత్నించడం కనిపించింది. బుచ్చి నుంచి నెల్లూరుకు బస్సులో వస్తున్న కానిస్టేబుల్‌ వెంకట్రావు వెంకటేశ్వరపురం వంతెనపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. నగరం నుంచి వేరే ప్రాంతానికి వెళుతున్న జిల్లా ఎక్సైజ్‌ అధికారి వెంకటరామిరెడ్డి, తన సిబ్బందితో వెెంకటేశ్వరపురం బ్రిడ్జిపై ఎదురుగా వచ్చే వాహనాలను వెనక్కి పంపించి ట్రాఫిక్‌ను గాడిలో పెట్టారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని