logo

జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు

రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు.

Published : 04 Dec 2022 02:34 IST

పునరావాస కాలనీకి శంకుస్థాపనలో కలెక్టరు, ఎమ్మెల్యే తదితరులు

కందుకూరు, గుడ్లూరు, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. ఓడరేవు నిర్మాణంతో తొలగించనున్న మొండివారిపాలెం గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు, నష్టపరిహారాన్ని శనివారం కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ పంపిణీ చేశారు. 111 మంది గ్రామస్థులకు అయిదు సెంట్ల చొప్పున నివేశన స్థల పట్టాలు అందించారు. కాలనీలో దేవాలయానికి భూమిపూజ, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఓడరేవు వ్యవసాయ, మైనింగ్‌ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందన్నారు. స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. భూములిచ్చిన ఆవులవారిపాలెం, కర్లపాలెం, మొండివారిపాలెం వాసుల సహకారం మరువలేనిదని కొనియాడారు. కాలనీలో అందరూ త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు.

ప్రతి హామీని నెరవేరుస్తాం

ప్రభుత్వంపై భూములిచ్చిన మత్స్యకారులకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి భిన్నంగా ఈ ప్రాంత ప్రజలు తమకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే సంపూర్ణ స్వేచ్ఛ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఓడరేవును 2023 డిసెంబరులోపు పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని, భవిష్యత్తు తరాలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు. మొండివారిపాలేనికి చెందిన 111 కుటుంబాలకు రూ.22.49 కోట్ల నగదు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జేసీ కూర్మనాథ్‌, కందుకూరు సబ్‌కలెక్టరు శోభిక, ఓడరేవు ఎండీ ప్రతాప్‌రెడ్డి, పర్యవేక్షణాధికారి ఐవీ రెడ్డి, తహసీల్దారు లావణ్య, జడ్పీటీసీ సభ్యుడు బాపిరెడ్డి, ఎంపీపీ రమేష్‌, గ్రామ కాపు పోలయ్య, సాలిపేట సర్పంచి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని