logo

పల్లెలకు కరెంట్ షాక్‌

ఉమ్మడి జిల్లాలోని 46 మండలాల్లో పంచాయతీలు రూ.198 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయని మూడు నెలల కిందట అధికారులు లెక్కతేల్చారు.

Published : 30 Jan 2023 01:48 IST

చెల్లించాల్సిన బిల్లులు రూ.89 కోట్లు
సర్‌ఛార్జి రూ.56 కోట్లు
విస్తుపోతున్న అధికారులు
న్యూస్‌టుడే, నెల్లూరు (జడ్పీ)

వెంకటాచలం మండల పరిధిలో చెముడుగుంట పంచాయతీకి 18 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ఇటీవల రూ.57 లక్షల విద్యుత్తు బిల్లు చెల్లించాలని ఆశాఖ అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై స్పందించిన గ్రామ కార్యదర్శి అంత బిల్లు ఎందుకు వచ్చిందని లోతుగా ఆరా తీశారు. బిల్లులన్నీ లెక్కిస్తే దాదాపు రూ.39 లక్షలు మాత్రమే వచ్చింది. మరి మిగతా రూ.18 లక్షలు ఎందుకు కట్టాలని వారం రోజులుగా విద్యుత్తుశాఖ అధికారుల చుట్టూ ఆయన తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. జిల్లాలోని పలు పంచాయతీలకూ ఇదే తరహాలోనే అదనపు బిల్లుల భారం పడింది.


పంచాయతీల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికే రావాల్సిన 15వ ఆర్థిక సంఘాల నిధుల జాడ లేక పరిపాలన నీరసించిన క్రమంలో.. విద్యుత్తు బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు శాఖ అదనపు వడ్డింపులకు దిగింది. అసలే బిల్లులు కట్టలేక అవస్థ పడుతున్న పంచాయతీలకు ఇది శరాఘాతంగా మారిందని సర్పంచులు, కార్యదర్శులు వాపోతున్నారు.

కొత్త స్తంభాలను తరలిస్తున్న విద్యుత్తు శాఖ అధికారులు

మ్మడి జిల్లాలోని 46 మండలాల్లో పంచాయతీలు రూ.198 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయని మూడు నెలల కిందట అధికారులు లెక్కతేల్చారు. ఈమేరకు కొత్త జిల్లాలోని 37 మండలాలు రూ.145 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇటీవల రూ.5 కోట్ల వరకు జమ చేసినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నాయి. ఇంకా రూ.140 కోట్ల భారం అలాగే ఉంది. అనేక పంచాయతీలకు మీటర్లు కూడా లేని నేపథ్యంలో భారీగా బిల్లులు రావడం ఏంటని పంచాయతీ సిబ్బంది విస్తుపోతున్నారు.

అసలు కన్నా కొసరే ఎక్కువ..

చెల్లించాల్సిన రూ.145 కోట్లలో విద్యుత్తు ఛార్జీలు రూ.89 కోట్లు కాగా పంచాయతీలు ఆలస్యం చేస్తున్నాయని, అదనంగా విద్యుత్తు వాడుతున్నాయని సాకులు చూపి మరో రూ.56 కోట్లు అదనంగా విధించినట్లు విద్యుత్తు శాఖ లెక్కలు చూపింది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ జిల్లా అధికారులు కూడా కంగుతిన్నారు. బిల్లులు ఎక్కువగా రావడానికి గల కారణాలపై కింది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పరిశీలన చేయకపోవడంతో సర్‌ఛార్జీల విషయం గుట్టుగా ఉంది. కొంత మంది కార్యదర్శులు లోతుగా పరిశీలన చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆర్థిక సంఘాల నిధులొచ్చిన సమయంలో పంచాయతీలపై ఒత్తిడి తెచ్చి కొంత భాగం విద్యుత్తు బిల్లులకు చెల్లించేలా ఒత్తిడి చేస్తున్న జిల్లా అధికారులు.. బిల్లులు, ఇతర ఖర్చులు, చెల్లింపులు తదితరాలను పట్టించుకోకపోవడంతో సర్‌ఛార్జీల బాదుడు వెలుగులోకి రాలేదు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రగతికి ఆటంకం

ఇంటికి కరెంటు బిల్లు గడువులోగా కట్టకపోతే అపరాధ రుసుం విధిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. పంచాయతీ అధికారులు మాత్రం దీన్ని విస్మరించారు. విద్యుత్తు శాఖ అధికారులు అనేక పంచాయతీలకు మీటర్లు బిగించకుండానే బిల్లులు ఎలా వేస్తున్నారనే విషయాన్ని గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం వచ్చిన బిల్లులను సకాలంలో చెల్లించలేదు. దాంతో విద్యుత్తుశాఖ సర్‌ఛార్జి, ఇతర కారణాల పేరుతో పంచాయతీలపై రూ.కోట్లు అదనంగా వసూలు చేస్తోంది. గ్రామాల్లో ప్రగతి పనులకు వాడాల్సిన నిధులను విద్యుత్తు సర్‌ఛార్జీలకు చెల్లించడం ఏంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు.


విద్యుత్తు శాఖకు లేఖలు రాస్తున్నాం

బి.చిరంజీవి, ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి

గ్రామ పంచాయతీల విద్యుత్తు బిల్లుల బకాయిలపై సర్‌ఛార్జీల రూపంలో దాదాపు రూ.89 కోట్ల భారం మోపిన విషయం మా సిబ్బంది బయటపెట్టారు. కానీ కొన్ని చిన్న పంచాయతీలకు పలుచోట్ల మీటర్లు లేకుండా బిల్లులు వేస్తున్నారని పలువురు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తప్పక స్పందిస్తాం. వెంటనే గ్రామ కార్యదర్శులను అడిగి వివరాలు సేకరిస్తాం. విద్యుత్తు శాఖ అధికారులకూ లేఖలు రాస్తున్నాం. కొద్ది బిల్లులున్న పంచాయతీలు సకాలంలో చెల్లించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని