logo

ఆపన్నులకు ఇస్తారా అభయం?

వారు ఏ ఆధారం లేని అభాగ్యులు. ఒకరు చేతుల బలంతో నడిచేవారు.. మరొకరు అడుగు తీసి అడుగేయలేనివారు.

Published : 06 Feb 2023 02:19 IST

సాయం కోసం అవస్థలు
న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌)

వారు ఏ ఆధారం లేని అభాగ్యులు. ఒకరు చేతుల బలంతో నడిచేవారు.. మరొకరు అడుగు తీసి అడుగేయలేనివారు. తమకు చేయూతనందించాలని వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో పాపమని స్పందించి వారికి సాయం చేసిన నాథులు లేరు. వారం కిందట కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారులకు మొర పెట్టుకున్నా.. నేటికీ సాయం అందలేదని వారు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


మూడేళ్లుగా పండుటాకు ప్రదక్షిణ

సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన షేక్‌ హసీనాబేగం వయస్సు 70 ఏళ్లు. ఏ ఆధారం లేదు. ఎవరి అండా లేదు. కనీసం ఉండేందుకు ఇళ్లు కూడా లేదు. వృద్ధాప్యం కారణంగా నడవలేని పరిస్థితి. తనకు పింఛను మంజూరు చేయాలని మూడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదో ఒక వంకతో పింఛను మంజూరు చేయడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమిచ్చే పింఛను నగదు కొంతవరకైనా ఆదరవుగా ఉంటుందని, ఉన్నతాధికారులైనా స్పందించి తనను ఆదుకోవాలని ఆ పండుటాకు దీనంగా వేడుకుంటున్నారు.


రెండు చేతులే ఆధారం.. కావాలి మీ సహకారం

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఆపై పక్షవాతం.. రెండు కాళ్లు పని చేయవు.. ఎక్కడి వెళ్లాలన్నా కుమారుడి సాయం లేనిదే వెళ్లలేని పరిస్థితి. దాంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన తిరుపతి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల కిందట పక్షవాతం రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. భూమిపై రెండు చేతులు కింద పెట్టి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. దాంతో కూలి పనులకు వెళ్లలేరు. కుమారుడు తోడుంటే.. బాడుగ ఆటోలో తన పనులపై వెళుతుంటారు. ఈక్రమంలో గతనెల 30వ తేదీన బాడుగ ఆటోకు రూ.2 వేలు అద్దె చెల్లించి కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చి జిల్లా అధికారులను కలిసి తన దీనగాథను విన్నవించుకున్నారు. తనకు బ్యాటరీ సైకిల్‌ ఇప్పించాలని కోరారు. ఈరోజు వరకు ఆయనకు అధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో దీనంగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, దాతలు ఎవరైనా స్పందించి బ్యాటరీ సైకిల్‌ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దీని సాయంతో తాను ఏదోఒక చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటానని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని