logo

ప్రభాస్‌.. శెభాష్‌

కూలీ పనులు..ఆపై రెండు పాడిగేదెలు. అవే వారి జీవనాధారం. తమ బిడ్డలకు కష్టం రాకూడదని శ్రమించిన దంపతులు .. ఇద్దరు కుమారులను బాగా చదివించారు.

Published : 20 Mar 2023 05:28 IST

న్యూస్‌టుడే, ఆత్మకూరు: కూలీ పనులు..ఆపై రెండు పాడిగేదెలు. అవే వారి జీవనాధారం. తమ బిడ్డలకు కష్టం రాకూడదని శ్రమించిన దంపతులు .. ఇద్దరు కుమారులను బాగా చదివించారు. వీరి పెద్ద కుమారుడు ప్రభాస్‌రెడ్డి అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలోనే రూ. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఆపై ‘గేట్‌’లో 135 ర్యాంకు సాధించి ప్రశంసలు పొందుతున్నారు. ఈ విద్యార్థి ప్రస్థానాన్ని పరిశీలిస్తే..

ఆత్మకూరు పట్టణం మేధరవీధికి చెందిన ఒంటేరు లక్ష్మణరెడ్డి- మంజులమ్మ దంపతులు కూలీ ఆధారంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రభాస్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి. ప్రభాస్‌రెడ్డి పాఠశాల నుంచి చదువులో ప్రతిభ చూపారు. పాఠశాల విద్య స్థానిక రవీంద్రభారతి పాఠశాలలో పూర్తిచేశారు. 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన నెల్లూరు విశ్వసాయి జూనియర్‌ కళాశాల నిర్వాహకులు ఉచితంగా మొదటి సంవత్సరం ప్రవేశం కల్పించారు. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన ప్రభాస్‌ ఇంటర్‌లో శ్రమించి ప్రతిభ చూపారు. 970 మార్కులు సాధించారు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించి అనంతపురం జేఎన్‌టీయూలో ప్రవేశం పొందారు. 80 శాతంపైనే మార్కులతో ఇంజినీరింగు మూడు సంవత్సరాలు పూర్తి చేశారు. నాలుగో ఏడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఫ్యాక్ట్‌సెట్‌ అనే కంపెనీ హైద్రరాబాద్‌లో కొలువు ఇచ్చింది. ఈ ఉద్యోగంలో చేరిన ప్రభాస్‌ గేట్‌ పరీక్షలు రాశారు. అదే క్రమంలో 135 ర్యాంకు సాధించి దేశంలో ఏ ఐఐటీలో అయినా ప్రవేశం పొందేలా అర్హత సాధించారు. ఇలా పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్‌రెడ్డి ప్రతిభతో ఐఐటీలో ఎంటెక్‌ చేయనున్నారు.


తల్లిదండ్రుల కష్టమే స్ఫూర్తి
- ప్రభాస్‌రెడ్డి

మా చదువులకు అమ్మానాన్న ఎంత కష్టపడుతున్నారో దగ్గర నుంచి చూశాం. వారి కష్టాలు తీరాలంటే బాగా చదవాలనే ఆలోచన మనస్సులో నిలిచిపోయింది. దీంతో శ్రమించి చదవడంతో మంచి ఫలితాలు వచ్చాయి. రూ. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. గేట్‌లో మంచి ర్యాంకు సాధించా. ఐఐటీ ముంబయి, బెంగళూరుల్లోని ఐఐటీలో ఒకదానిలో ఎంటెక్‌లో చేరి పూర్తి చేస్తా. సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే శ్రమించాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని