logo

ఆ మాంసం తింటే అంతే!

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేరళలో.. పాడైన మాంసంతో వండివార్చిన ఆహారం తిన్న పదకొండో తరగతి విద్యార్థి అన్యాయంగా బలైపోతే.. అదే వంటకాన్ని ఆరగించిన మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు.

Updated : 26 Mar 2023 13:59 IST

ఓ హోటల్‌పై ఎన్‌ఎంసీ అధికారుల దాడులు
నోటీసులు జారీ

అధికారుల తనిఖీల్లో గుర్తించిన నిల్వ మాంసం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేరళలో.. పాడైన మాంసంతో వండివార్చిన ఆహారం తిన్న పదకొండో తరగతి విద్యార్థి అన్యాయంగా బలైపోతే.. అదే వంటకాన్ని ఆరగించిన మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత.. తీరిగ్గా కళ్లు తెరిచిన అధికారులు.. ఆహార భద్రతా ప్రమాణాలు పాతిపెడుతున్నారంటూ సుమారు 200 హోటళ్లను మూయించారు. ఈ కేసులో నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా- ‘ప్రజారోగ్యం పట్ల దేశంలో మనం వ్యహరించేంత ఉదాసీనంగా ఇంకెవరూ ఉండర’ని చెప్పి బెయిల్‌ నిరాకరిస్తూ ఆవేదన వెలిబుచ్చింది. నెల్లూరు నగరంలోనూ ఇంచుమించు పరిస్థితి అలాగే ఉంటోంది. అధికారుల తనిఖీల్లో తరచూ కుళ్లిన మాంసం.. రోజుల కొద్దీ ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం.. అపరిశుభ్రత మధ్యే వంటలు.. డ్రైనేజీల పక్కనే గ్యాస్‌ స్టవ్‌లు.. అడ్డగోలుగా రంగులు గుప్పించిన పదార్థాలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హోటళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి.

ఫిర్యాదుల నేపథ్యంలో..

నెల్లూరులోని ఓ  హోటల్‌లో నగరపాలక సంస్థ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. సుమారు వంద కిలోలకు పైగా మాంసం, చేపలు, రొయ్యలు ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వండిన వాటిలో మిగిలిన ఆహార పదార్థాలను.. వండని మాంసంలో కలిపి పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మాంసం వ్యర్థాలనూ అదే ఫ్రిజ్‌లో పెట్టారు. దానికి తోడు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంలో నిబంధనలు పాటించడం లేదని.. మిఠాయిలు, ఇతర ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాలపై గడువు తేదీ వేయలేదని గుర్తించారు. ఆ పరిస్థితులపై నగరపాలక సంస్థ ఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హోటల్‌లో ఆహారం తీసుకున్న వినియోగదారులు అనారోగ్యానికి గురయ్యారని, దానిపై నిర్వాహకులు సరిగ్గా స్పందించలేదని తమకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు తనిఖీలు చేశామని ఎన్‌ఎంసీ అధికారులు తెలిపారు.

రూ. లక్ష జరిమానా

తనిఖీలకు వెళ్లిన నగరపాలక సిబ్బందితో హోటల్‌ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మా దగ్గర తాజా ఆహారం ఉందని.. దానికి సంబంధించిన ఓచర్లు ఉన్నాయని, ల్యాబ్‌కు పంపించి తనిఖీలు చేయకుండా నిల్వ మాంసం అని ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు. దానికి స్పందించిన అధికారి.. ఈ రోజు కొన్న మాంసం ఫ్రీజర్‌లో పెట్టాల్సిన అవసరం ఏమిటని? అసలు మీ దగ్గర  పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? వండిన ఆహారాన్ని పచ్చి మాంసంతో కలిపిపెట్టారు. దాన్నే ప్రజలకు పెడతారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఫ్రిజ్‌లో పెట్టిన మాంసం వండి పెడతామని వినియోగదారుడికి తెలిసేలా బయట బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. హోటల్‌ నిర్వాహకులకు రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు..నోటీసులు జారీ చేశారు.

నిల్వ ఆహారం అమ్మితే కఠిన చర్యలు

వెంకటరమణ,  ఎంహెచ్‌వో : వినియోగదారుల ఫిర్యాదు మేరకు తనిఖీ చేశాం. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన మాంసం ఉంది. పచ్చి మాంసంతో పాటు వండిన పదార్థాలనూ అందులోనే ఉంచారు. మాంసం వ్యర్థాలను కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు. నాణ్యతలేని ఆహారం విక్రయించేందుకు ఉంచడంతో పాటు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా నిల్వ చేసిన ఆహారం విక్రయిస్తే.. భారీ జరిమానా విధించడంతో పాటు, హోటల్‌ సీజ్‌ చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని