logo

నెల్లూరు గళం పార్లమెంట్‌లో వినిపిస్తాం

నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది.

Published : 06 May 2024 05:58 IST

హామీల పత్రం చూపుతున్న వై.ఎస్‌. షర్మిల, ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, చిత్రంలో అసెంబ్లీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవకుమార్‌రెడ్డి

కోవూరు, న్యూస్‌టుడే: నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. ఎంపీగా గెలిపిస్తే.. దిల్లీలో మీ కోసం పోరాడుతారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలను కోరారు. ఆదివారం కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే.. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తీసుకొచ్చి.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొప్పుల రాజు మాట్లాడుతూ.. తాను కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో ఇక్కడ జరిగిన సారా వ్యతిరేక, అక్షరాస్యత, పొదుపు ఉద్యమాలకు సహకారం అందించానన్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను, ఇచ్చిన హామీలను వివరించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి వెంటనే పూర్తి చేయాల్సి ఉన్నా.. సీఎం జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. కోవూరు అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దేవకుమార్‌రెడ్డి, సీపీఎం నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, శేషయ్య, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని