logo

అవ్వా తాతాలకు.. పింఛన్‌ టెన్షన్‌

జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది.

Published : 07 May 2024 03:58 IST

నాడు : తెదేపా ప్రభుత్వ హయాంలో అర్హులైన వారికి తెలుపు రేషన్‌ కార్డు ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. ఒకసారి పింఛను లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారే లేరు. పింఛనుదారులు ఏదైనా కారణంతో ఒకటి, రెండు నెలలు వరుసగా పింఛను తీసుకోలేకపోతే మూడు నెలల మొత్తం సొమ్ము కలిపి చెల్లించారు. జీవనోపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లినవారు రెండు నెలలకొకసారి స్వగ్రామానికి వచ్చి తీసుకునేవారు. ఒక నెల అందకుంటే తరువాత అయినా తీసుకోవచ్చనే ధీమా పింఛనుదారుల్లో ఉండేది.


నేడు: ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో పింఛనుదారులు ప్రతి నెలా ఆందోళన చెందాల్సి వస్తోంది. ఒకసారి పింఛను ఇస్తున్నారు కదా... బతికున్నంత కాలం అందుతుందనుకుంటే పొరపాటే. ఆరంచెల పరిశీలనలో ఎప్పుడైనా వాటిని తొలగించేయచ్చు. ఏదైనా కారణంతో ఒక నెల అందుకోకపోతే ఆ డబ్బులు హుష్‌కాకే. ఈ భయంతో లబ్ధిదారులు జీవనోపాధికి దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. వెళ్లినవారు వారు నెలనెలా పింఛనుకు వచ్చి అందులో సగం రవాణా ఛార్జీలకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

 న్యూస్‌టుడే, దుత్తలూరు : జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. మొదట్లో ప్రభుత్వం కొత్త పింఛన్లకు ప్రతినెలా వచ్చే దరఖాస్తుల్లో అర్హులైన వారికి తరువాత నెలలోనే మంజూరు చేస్తామని ప్రకటించింది. అనంతరం కొద్ది రోజులకే ‘అబ్బే... నెలనెలా కొత్తవి మంజూరు చేయలేం... ఆరు నెలలకొకసారి మాత్రమే ఇస్తామని ప్రకటించింది. వాటికి కూడా ఆరు దశల ఆంక్షలు పెట్టింది. పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారికి అయిదెకరాలపైన భూమి, ఇల్లు పెద్దగా, ఇంట్లో ఎవరూ నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. ఆదాయ పన్ను చెల్లించకూడదనే నిబంధనలు విధించారు. ఇదిలా ఉండగా ప్రతి ఆరు నెలలకొకసారి ఓ చేత్తో కొత్త పింఛన్లు ఇస్తూనే... మరోవైపు పాతవి తొలగిస్తున్నారు.

గతంలో వృద్ధాప్య పింఛను అందుకునే పురుషులు ఎవరైనా చనిపోతే వారి భార్యకు ఒకటి, రెండు నెలల్లో వితంతు పింఛను మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించారు. ప్రస్తుతం ఆరు నెలల వరకు మంజూరు చేయటంలేదు. జిల్లాలో ఇలాంటి అవస్థలు పడుతున్న వితంతువులు ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఉన్నారు. పింఛను వస్తూ ఏదైనా కారణంగా ఆగిపోతే దాని పునరుద్ధరణకు కూడా ఆరు నెలలు ఆగాల్సిన దుస్థితి నెలకొంది. తెదేపా హయాంలో ఒక నెల ఆగితే, మరుసటి నెలలోనే లబ్ధిదారుని పింఛన్‌ పునరుద్ధరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త వాటికి నెలల తరబడి నిరీక్షిస్తున్నవారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.


ప్రతి నెలా రావాల్సి వస్తోంది

రమణమ్మ, దుత్తలూరు : జీవనోపాధి నిమిత్తం నా కుమారులు తెలంగాణలో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో మూడు నెలలకొకసారి స్వగ్రామానికి వచ్చి పింఛను తీసుకుని వెళ్లేదాన్ని. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ప్రతి నెలా తీసుకోకపోతే ఆ నెల నగదు ఇక రాదని అధికారులు చెప్పారు. దీంతో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చి తీసుకోవాలంటే అనేక అవస్థలు పడుతున్నా. దీనికితోడు వచ్చే నగదులో సగం ఛార్జీలకే సరిపోతున్నాయి.


నిబంధనలు సడలించాలి

వెంకట్రావు, వృద్ధుడు : గతంలో తెల్లరేషన్‌ కార్డు ఆధారంగా పింఛను మంజూరు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. దీంతో అర్హులైన చాలా మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అయిదెకరాలపైబడి భూమి ఉండటం, 300 యూనిట్ల విద్యుత్తు వాడకం వంటి నిబంధనలతో వృద్ధులను పింఛన్లను దూరం చేస్తోంది. వీటిని సడలిస్తే ఎంతో మంది వితంతువులు, వృద్ధులకు మేలు జరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని