logo

అడిగింది రూ.8,400 కోట్లు... ఇచ్చింది రూ.10,012 కోట్లు

ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్‌లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

Updated : 04 Feb 2023 03:18 IST

ఒడిశా రైల్వేలకు ప్రాధాన్యం?: రైల్వేశాఖ మంత్రి

అశ్వినీ వైష్ణవ్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్‌లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రి విలేకరులతో మాట్లాడుతూ...ఈసారి జరిగిన కేటాయింపుల్లో కొత్త రైలు మార్గాల పనులకు రూ.2,564 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ.3,800 కోట్లు ఖర్చవుతాయన్నారు. పూరీ జగన్నాథ్‌ రైల్వే స్టేషన్‌కు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం ధ్యేయంగా నిర్మాణాలు ప్రారంభం కాగా, భువనేశ్వర్‌ స్టేషన్‌ ఆధునికీకరణకూ సన్నాహాలు ముమ్మరం చేశామన్నారు. త్వరలో కటక్‌ కూడా మోడల్‌ స్టేషన్‌ కానుందని చెప్పారు. ఈ ఏడాదిలో ఒడిశాలోని 57 స్టేషన్ల ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.

త్వరలో వందే మెట్రో రైళ్లు

భువనేశ్వర్‌-పూరీ, కటక్‌-భువనేశ్వర్‌, ఝార్సుగుడ-రవుర్కెలా, సంబల్‌పూర్‌-ఝార్సుగుడల మధ్య వందేభారత్‌ మెట్రో రైళ్లు నడుస్తాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. అభివృద్ధి, సౌకర్యాలు ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ ఒడిశాలో రైల్వేలకు కేటాయింపులు పెంచారన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలోని అత్యధిక స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 2047 నాటికల్లా ‘వికసిత భారత్‌’ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో ఈస్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన పూరీ స్టేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని