logo

ఆహుతవుతున్న పచ్చదనం

రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది.

Published : 28 Mar 2024 04:27 IST

2030 నాటికి తీవ్రం కానున్న అడవులకు నిప్పు ఘటనలు

అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. రాష్ట్రంలో బూడిదవుతున్న పచ్చదనం అంశంపై భౌగోళిక శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల బృందం తాజాగా చేపట్టిన ఓ అధ్యయనం ఈ వివరాలను బహిర్గతం చేసింది. వాటి ప్రకారం.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా సహజవనరుల వినియోగం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మైనింగ్‌, పోడు వ్యవసాయం, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ తగ్గడం కారణంగా అడవులకు నిప్పు ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముంది. అధ్యయన రచయిత బృందంలో ఒకరైన ఎఫ్‌.ఎం. విశ్వవిద్యాలయం (బాలేశ్వర్‌) భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్‌ మనోరంజన్‌ మిశ్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో దాదాపు 31,666 చదరపు కి.మీలో అత్యధిక అడవులకు నిప్పు ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. మంటల నియంత్రణకు సమగ్ర నిర్వహణ ప్రణాళికలు అమలు చేయడం, ముందుగా గుర్తించడం, మంటల వ్యాప్తిని అరికట్టడం తదితర చర్యలతో ఈ ప్రభావాన్ని కొంతమేర తగ్గించవ్చని మిశ్ర సూచించారు.

మంటలను అదుపు చేెస్తున్న సిబ్బంది

పది జిల్లాల్లో తీవ్రత:- రాయగడ, అనుగుల్‌, సంబల్‌పూర్‌, సుందరగఢ్‌, కొంధమాల్‌, మల్కాన్‌గిరి, కొరాపుట్‌, గజపతి, కలహండి, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో వీటి తీవ్రతకు ఎక్కువ అవకాశాలున్నట్లు అధ్యయనం వెల్లడించింది. 2001-2022 మధ్య రాష్ట్రంలో ఏడాదికి సగటున 3,877 చొప్పున మొత్తం 85,307 ఘటనలు వెలుగుచూసినట్లు అధ్యయనం ప్రస్తావించింది. 2015 తరువాత ఇవి ఎక్కువగా పెరిగినట్లు బృందం బహిర్గతం చేసింది. 2001-2010 మధ్య 28,286 ఘటనలు వెలుగుచూడగా 2011-2022 మధ్య ఇవి 57,021గా నమోదు కావడం గమనార్హం. గడిచిన 22 ఏళ్లలో ఈ తరహా ఘటనలు అనుగుల్‌ జిల్లాలో అత్యధికంగా 14,009 వెలుగు చూసినట్లు అధ్యయన బృందం పేర్కొంది. రుతుపవనాలకు ముందు సీజన్లో (జనవరి-మే) మొత్తం ఘటనల్లో 67.73 శాతం ఘటనలు నమోదవుతున్నట్లు ఈ బృందం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని