logo

ఉపాధి లక్ష్యం చేరేలా అడుగులు

జిల్లాలో 1.30 కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకంలో కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మెరుగుపర్చే పనులను ప్రతిపాదిస్తేనే లక్ష్యం నెరవేరుతోందని అధికారులు నిర్ణయించారు.

Published : 01 Feb 2023 03:05 IST

కాలువల ఆధునికీకరణకు ప్రణాళిక  

గుమ్మలక్ష్మీపురం మండలంలో గుమ్మిడిగెడ్డపై చెక్‌డ్యాం కాలువ పరిస్థితి

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో 1.30 కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకంలో కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మెరుగుపర్చే పనులను ప్రతిపాదిస్తేనే లక్ష్యం నెరవేరుతోందని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లాలోని సాగునీటి వనరుల కింద పంట కాలువల్లో పూడిక తీతలను ఉపాధి పనుల్లో చేసేందుకు ప్రతిపాదించారు. మొత్తం రూ.1.40 కోట్లతో 304 కిలోమీటర్ల పొడవున పూడికలు తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గిరిజన ప్రాంతంలో చెక్‌డ్యాం కింద కాలువలను శుభ్రం చేయనున్నారు.

చెక్‌డ్యాంల పరిధిలో మెరుగులు..  

జైకా సహకారంతో పెద్దగెడ్డ, పెదంకలాం, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆయా చోట్ల ఇప్పటికే కాలువలను బాగు చేస్తుండగా మళ్లీ పూడిక తీతలు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కైరాడ, పనసభద్ర, గుమ్మిడిగెడ్డపై నిర్మించిన చెక్‌డ్యాంల పరిధిలోని కాలువలు, వరహాలగెడ్డ, పాచిపెంట, సాలూరు మండలాల్లో వేగావతి నదిపై ఉన్న సాగునీటి కాలువలకు మెరుగులు దిద్దనున్నారు.

వీటితో పాటు వరహాల గెడ్డ, గుమ్మిడిగెడ్డ, కొండలేవిడి, కైరాడ, పాచిపెంట మండలంలోని వట్టిగెడ్డ, వేగావతి నదులపై ఉన్న చిన్న చిన్న జలవనరులకు సంబంధించిన కాలువల్లో పూడిక తీసే పనులను ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు.


ఇబ్బందులు లేకుండా..:

జైకా నిధులతో చేపట్టిన పనులు కాకుండా మిగిలిన కాలువలపై చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. దీనిలో భాగంగా పిల్లకాలువల్లాంటివి జలయాజమాన్య సంస్థ చేపడుతుంది. జైకా పనులకు వీటికి సంబంధం ఉండదు. రెండు శాఖల సమన్వయంతో పనులు గుర్తించడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు.

ఆర్‌.అప్పలనాయుడు, జిల్లా జలవనరుల శాఖాధికారి


అనుమతుల మేరకు పనులు..:

కలెక్టర్‌ ఇచ్చిన అనుమతుల మేరకు ఉపాధి పనుల్లో కాలువలను ప్రతిపాదించాం. వీటిని నిర్ధిష్ట కాలవ్యవధిలో వేతనదారులతో చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.  

రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని