logo

నోట్లతో ఎర.. బెదిరింపులు జర

పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేశారు.

Published : 07 May 2024 04:49 IST

ఉద్యోగుల ఓట్లకు తంటాలు

మన్యంలో నగదు చెల్లింపులు

 విజయనగరంలో బుజ్జగింపులు

 

జేఎన్‌టీయూ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు

ఈనాడు, విజయనగరం:్య పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేశారు. వైకాపా నాయకులు బలిజిపేట మండలంలో పనిచేసే ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున ఇచ్చారు. వారు నిరాకరించినా బలవంతంగా చేతిలో పెట్టారు. సుమారు 61 మంది తీసుకున్నట్లు సమాచారం. బలిజిపేట వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావు సొంత మండలం కావడం గమనార్హం.

  • సీతానగరం మండలంలో మరో 60 మంది అంగన్‌వాడీలకు కాసులు ఎర వేశారు. అందరూ డబ్బులు తీసుకుని తమ పార్టీకే ఓటేయాలని నాయకులు కోరగా.. వారంతా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
  • పార్వతీపురం పట్టణ పరిధిలోని అంగన్‌వాడీలతోనూ అధికార పార్టీ నాయకులు మాట్లాడారు. వారు ససేమిరా అనడంతో వారి చరవాణి నంబర్లు సంపాదించి రూ.2 వేల చొప్పున ఫోన్‌పే చేసినట్లు తెలిసింది.
  • బొబ్బిలి నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు అందుకున్న వారిలో ఉపాధ్యాయులు అధికం. సోమవారం ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి ఆయా ప్రాంతాల వైకాపా నాయకులు ఫోన్లు చేశారు. తమ పార్టీకి ఓటేసి, దాన్ని చరవాణిలో ఫొటో తీసి పంపించాలని ఆదేశించారు. పంపని వారు ఓటేయలేదని భావిస్తామని, తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని బెదిరించినట్లు తెలిసింది. వీటిని వారెవరూ పట్టించుకోకుండా వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉద్యోగులందరూ వ్యతిరేకతతో ఉన్నారు. పైగా వారికి ఎంత పగ ఉందో ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం అందిన దరఖాస్తులు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై మీకు వ్యతిరేకత ఉండవచ్చు.. కానీ మీకు ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం.. అర్థం చేసుకోండి.. మాకే ఓటేయండని నాయకులు ప్రాథేయపడినా ఛీకొట్టారు.

  జాబితాల్లో పేర్లు లేవు..

విజయనగరంలోని జేఎన్‌టీయూలో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేవని కొందరు.. ఉన్నా జారీ చేయలేదని మరికొందరు ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల శిక్షణలో దరఖాస్తులు ఇచ్చామని, ఇప్పుడు ఓటు వినియోగానికి వస్తే పేర్లు లేవని చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారి ఓటుహక్కు ఉన్న నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్‌ కేంద్రానికే వెళ్లాలని కలెక్టర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని