logo

ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం

‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం.

Published : 08 May 2024 04:58 IST

ఉమ్మడి మేనిఫెస్టోతో యువతకు ఉపాధి.. మహిళలకు సాధికారత
‘ఈనాడు’ ముఖాముఖిలో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత

ఈనాడు, పార్వతీపురం మన్యం: ‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సూపర్‌- 6కు కేంద్రంలో మోదీ సంకల్ప్‌పత్ర్‌ జతచేసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని అరకు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పేర్కొన్నారు. గిరిజన ప్రాంత సమాహారంగా ఉన్న అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రూపొందించిన కార్యాచరణ వివరించారు.

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పనకు పెద్దపీట ..

‘నియోజకవర్గ జనాభాలో చదువుకున్న యువత 40 శాతం మంది ఉన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ యువత జీవితాలను అతలాకుతలం చేసేశారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడానికి చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు అందిస్తాం. సూపర్‌- 6 ద్వారా ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం యువశక్తి కార్యక్రమం ద్వారా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగ యువతకు రాయితీపై బ్యాంకు రుణాలు, ముద్ర రుణాలను రూ.20 లక్షల వరకు అందిస్తాం. యువత వారి కాళ్లపై వారు నిలబడే విధంగా నియోజకవర్గాల వారీగా నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు చూపించి నిరుద్యోగిత తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తా.

రైతు పక్షపాతిగా వ్యవహరిస్తాం

రైతులు ఏటా రెండు పంటలు పండించుకునేలా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తాం. మన్యంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా చెక్‌డ్యామ్‌లను ప్రతి మండలానికి కనీసం 10 చొప్పున నిర్మిస్తాం. చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు ద్వారా నియోజకవర్గ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించే అవకాశం ఉంది. రైతుకు ఏటా రూ.20 వేలు అందిస్తాం. 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం.

ఉద్యోగులకు తోడుగా ఉంటాం..

వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులుగా చూసింది. ఏనాడు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపానపోలేదు. వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదు. అడిగితే కేసులతో వేధించారు. మేం అధికారంలోకి వచ్చాక సుహృద్భావ వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా చూస్తాం. ఒకటో తేదీనే జీతభత్యాలు అందేలా చూస్తాం.

6 లక్షల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌బండలు

‘మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కూటమి తోడుగా నిలుస్తుంది. సూపర్‌ సిక్స్‌ ద్వారా మహిళలకు రూ.10 లక్షల వరకు పొదుపు రుణాలపై వడ్డీ లేకుండానే ఇవ్వబోతున్నాం. దీనివల్ల నియోజకవర్గ పరిధిలోని 50 వేల డ్వాక్రా సంఘాల్లోని 5 లక్షల మంది పొదుపు మహిళలకు సున్నా వడ్డీ లబ్ధి చేకూరుతుంది. ఇంటింటికీ మూడు గ్యాస్‌ బండలు ఉచితంగా ఇవ్వబోతున్నాం. నియోజకవర్గంలో 6 లక్షల కుటుంబాలకు ఈ ఉచిత సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వనున్నాం. నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో ఉద్యోగినులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభించేలా వారిలో నైపుణ్యం అందిస్తాం.

పింఛను రూ.4 వేలకు పెంపు

వైకాపా ప్రభుత్వం ఒకచేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 తీసుకుంటోంది. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ, తలసీమియా బాధితులకు రూ.10 వేలు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వారికి రూ.15 వేల చొప్పున అందజేస్తాం.

సామాజిక వర్గాలన్నింటికీ సమ ప్రాధాన్యం

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తాం. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పథకాలను 36 వరకు రద్దు చేసింది. వాటన్నింటిని పునరుద్ధరిస్తాం. ట్రైకార్‌ రుణాలను పునరుద్ధరించి యువత స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటాం. రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు అందిస్తాం. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష సాయం అందిస్తాం. ఈద్గాలు, ఖబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు చెల్లిస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం.  బీసీ ఉప ప్రణాళిక కింద రాష్ట్రంలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి ఆదరణ కింద ఆధునిక పరికరాలు అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని