logo

స్వేచ్ఛగా నిర్లక్ష్యం

పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో వీటి వితరణ, నిర్వీర్యం కోసం లక్షలాది రూపాయల

Published : 23 Jan 2022 03:31 IST

 పాఠశాలల్లో అమలుకు నోచుకోని వితరణ యంత్రాలు
 విద్యార్థినులకు తప్పని ఇబ్బందులు

ఈనాడు డిజిటల్, ఒంగోలు  పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో వీటి వితరణ, నిర్వీర్యం కోసం లక్షలాది రూపాయల విలువైన యంత్రాలను పాఠశాలలకు అందజేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసినా వినియోగం కావడంలేదు. చాలా చోట్ల ఆ యంత్రాలను ఏర్పాటు చేయలేదు. చాలా చోట్ల వీటిని మూలన పడేసి నేరుగా విద్యార్థినులకు రెండు మూడు నెలలకు ఒకసారి ప్యాడ్లు అందజేస్తున్నారు. యంత్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అత్యవసర సమయాల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

 నిర్వహణ లోపించి
యుక్తవయసులో ఉన్న బాలికలు, మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వేచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేయాలని,  ఈ సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అక్టోబరులో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 10లక్షల మంది విద్యార్థినులకు న్యాప్‌కిన్లు అందజేస్తామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని 6,417 పాఠశాలల్లో వితరణ మిషన్లు, వాటిని కాల్చి నిర్వీర్యం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
 386 యంత్రాల అందజేత
జిల్లాలో 192 పాఠశాలల్లో 192 న్యాప్‌కిన్లు వితరణ యంత్రాలు, 192 వినియోగించిన వాటిని నిర్వీర్యం చేసే యంత్రాలను ఆయా పాఠశాలలకు అందజేశారు. ఆయా పాఠశాలల్లో దాదాపు లక్షమంది బాలికలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఏడాదికి 120 చొప్పున అందజేయాల్సి ఉండగా వారి కోటా మేరకు రెండు మూడు నెలలకు ఒకసారిగా అందజేస్తున్నారు. ఒకేసారి ఇస్తుండటంతో కొందరు బాలికలు వాటిని ఇంటి వద్ద ఉంచుతున్నారు.

ఏర్పాటు చేసినా పనిచేయడం లేదు
గుడ్లూరులోని నాలుగు ఉన్నతపాఠశాలల్లో అమర్చేందుకు శానిటరీ న్యాప్కిన్ల వితరణ యంత్రం, వినియోగించిన న్యాప్‌కిన్లను నిర్వీర్యం చేసే పరికరాలను అందజేశారు. ఆ యంత్రాలను పాఠశాలల్లో అమర్చేందుకు సరైన విద్యుత్తు సదుపాయం లేకపోవడం,  ఇన్‌స్టాల్‌ చేసే సాంకేతిక సిబ్బంది రాకపోవడంతో ఇప్పటి వరకు వాటిని వినియోగించడం లేదు. పాఠశాలలకు ఇచ్చిన ఈ యంత్రాలు ఆయా పాఠశాలల స్టోర్‌ రూములు, వంట గదుల్లో పడి ఉన్నాయి. దీంతో వేల రూపాయల మిషన్లు తుప్పు పట్టి పాడై పోతున్నాయి. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం అన్ని డివిజన్లలోనూ చాలా పాఠశాలల్లో ఇంకా అమర్చనవి, వినియోగించనవి ఉన్నాయి. కొన్నిచోట్ల ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదు. ఒంగోలులోని ఒక ఉన్నత పాఠశాలలో  సాంకేతిక నిపుణులు రాక అలాగే పడి ఉన్నాయి. కనిగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో యంత్రాలను ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదు. అయినా విద్యార్థినులకు సంబంధించిన శానిటరీ న్యాప్‌కిన్లు వారి కోటా ప్రకారం పంపిణీ చేస్తున్నామని పాఠశాల  అధ్యాపకులు చెబుతున్నారు.


కనిగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయని యంత్రం

నిర్వహణ చర్యలు చేపడతాం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న హెఎల్‌ఎల్‌ కంపెనీ న్యాప్‌కిన్లు వితరణ, వినియోగించిన వాటిని నిర్వీర్యం చేసే యంత్రాలను పాఠశాలల్లో ఇన్‌స్టాల్‌ చేయాలి. ఒప్పందం ప్రకారం ఇన్‌స్టాలేషన్, నిర్వహణపై డెమో ఇవ్వాల్సి ఉన్నా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఇవ్వలేదు. జిల్లాలోని పరిస్థితి పైౖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే ఇన్‌స్టాల్‌ చేసి సక్రమంగా నిర్వహణ చేసే పనులను చేపడతాం.   - బి.విజయభాస్కర్, డీఈవో  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని