logo

కరోనాపై ఆందోళన వద్దు..!

కొవిడ్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించగానే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితి, వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో చేపట్టే అవగాహన, ఆసుపత్రుల్లో సౌకర్యాలు,

Published : 23 Jan 2022 03:31 IST

 ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో సౌకర్యాలు 
 జిల్లాలో ఒమిక్రాన్‌ లేదు
 ‘ఈనాడు’తో డీఎంహెచ్‌వో రత్నావళి

ఈనాడు డిజిటల్, ఒంగోలు కొవిడ్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించగానే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితి, వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో చేపట్టే అవగాహన, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, గృహ ఏకాంతంలో ఉన్నవారికి అందించే సూచనలు, వైద్యసిబ్బంది భర్తీ తదితరాలపై ‘ఈనాడు’ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ రత్నావళితో ‘ముఖాముఖి’ నిర్వహించింది. వివిధ అంశాలపై డీఎంహెచ్‌వో తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే..
పాజిటివ్‌ రేటు 49 శాతం
జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు 49 శాతంగా ఉంది. గతంతో పోల్చితే ఇది ఎక్కువే. రోజుకు సరాసరి 2500 నుంచి 3 వేల లోపు పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందులో దాదాపు 700-800 మధ్య పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి పెరిగాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశా, వైద్య సిబ్బందితో రైల్వే స్టేషన్లు, బస్టాండులు, పాఠశాలలు ఇలా ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి, మరణాలు లేకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నాం.
ఒమిక్రాన్‌ కేసులు లేవు
జిల్లాలోని క్రియాశీలక కేసుల్లో అన్నీ కొవిడ్‌ లక్షణాలు ఉన్నవే. ఇప్పటివరకు మొత్తం 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వారంతా కోలుకున్నారు. ఈ వేరియంట్‌ నిర్ధరణకు నమూనాలు ఇతర ప్రాంతాలకు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ జిల్లాలో లేదు. 
గృహ ఏకాంతంలో ఉన్నవారిపై దృష్టి
అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 3,120 మంది గృహ ఏకాంతం (హోం ఐసోలేషన్‌), 202 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. మిగిలిన వారిని గృహ ఏకాంతంలో ఉంచి ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వైద్యాధికారి ద్వారా పర్యవేక్షిస్తున్నాం. మందులు అందజేస్తున్నాం. లక్షణాలు తక్కువగా ఉండి, ఇళ్లలో మరుగుదొడ్లు, ప్రత్యేక గదుల సదుపాయం లేనివారిని కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపుతున్నాం.
నిర్లక్ష్యం చేయొద్దు
తీవ్రత తక్కువ ఉందని ప్రజలెవరూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. ఎక్కువమంది గుమిగూడిన చోటకు వెళ్లకుండా ఉంటే మంచిది. స్వల్ప లక్షణాలు ఉన్నా స్థానిక ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను, పీహెచ్‌సీకి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే అక్కడే మందుల కిట్‌ అందజేస్తారు. అక్కడి వైద్యుల సూచనలు పాటించడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే సమీపంలోని కొవిడ్‌ ఆసుపత్రులకు వెళ్లాలి. 

రెండింటికీ తేడా ఉంది
ఒమిక్రాన్, కొవిడ్‌ లక్షణాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. తొలివిడత కొవిడ్‌లో జలుబు, దగ్గు, జ్వరం సాధారణం. రెండోదశ డెల్టా వేరియంట్‌లో వీటితోపాటు ఒళ్లు నొప్పులు ఎక్కువమందిలో ఉన్నాయి. ఒమిక్రాన్‌కు వచ్చేసరికి జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, అలసట ఎక్కువగా ఉంటోంది. జలుబుతో ముక్కుకారడం ఉండదు. కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ తీవ్రత తక్కువ. ఇటీవల ఒమిక్రాన్‌ వచ్చిన బాధితులు మూడు నాలుగు రోజుల్లోనే కోలుకున్నారు. 


డాక్టర్‌ రత్నావళి 

వైద్యసేవలకు 49 ఆసుపత్రుల గుర్తింపు
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12, అలాగే ఒంగోలులో అదనంగా మరొకటి కలిపి 13 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 850 పడకల సదుపాయం ఉంది. ప్రస్తుతం 22 మంది వైద్యం పొందుతున్నారు. ఆసుపత్రులతో పాటు ఈ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది, మందులు, పడకలు, ఆక్సిజన్‌ సిద్ధంగా ఉంచాం. మరో 19 ప్రభుత్వ, 30 ప్రైవేట్‌ ఆసుపత్రులు (మొత్తం 49) గుర్తించి వాటిలో కూడా ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నాం. ఇటీవల ఖాళీగా ఉన్న వైద్యులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, నర్సుల పోస్టులను భర్తీచేశాం. కొవిడ్‌ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం ఉంది. వైద్య నిపుణులను సిద్ధంగా ఉంచాం. పాఠశాలల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. బడులకు వెళ్లని విద్యార్థుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే సమీపంలోని ఏఎన్‌ఎంలను సంప్రదించడం, పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవచ్చు.

ఒక్కరోజే 1001 మందికి వైరస్‌
* 16 మంది ఉపాధ్యాయులకూ నిర్ధారణ
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం 1001 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో దాదాపు 2 వేల మందికి పరీక్షలు చేశారు. అత్యధికంగా ఒంగోలులో 390, అద్దంకిలో 71, కనిగిరిలో 52 నమోదయ్యాయి. పాఠశాలల్లో 16 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు నిర్ధారణ అయింది. డీఈవో కార్యాలయంలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక శనివారం 171 కేంద్రాల ద్వారా 18 ఏళ్లు దాటిన వారు 10,533 మందికి టీకా వేశారు. బూస్టర్‌ డోస్‌ను 32,139 మంది వేయించుకున్నారు.
పరీక్షలు 135.. కేసులు 123
మద్దిపాడు, న్యూస్‌టుడే: మద్దిపాడు మండలంలో శనివారం 135 మందికి పరీక్షలు నిర్వహించగా 123 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు. ఆరోగ్యకేంద్రానికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తేనే ఇంత ఉద్ధృతిగా ఉంటే ప్రతి గ్రామంలోనూ కరోనా అధికంగా ఉందన్నారు. అంతా అప్రమత్తంగా ఉంటేనే తప్ప నివారించడం కష్టమవుతుందన్నారు. 
ఎమ్మెల్యే స్వామికి కరోనా పాజిటివ్‌
టంగుటూరు, న్యూస్‌టుడే: కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే, తెదేపా ముఖ్య నాయకుడు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనతో ఉండే కొందరు నాయకులకు పాజిటివ్‌ రావడంతో ఎటువంటి లక్షణాలు లేకపోయినా శుక్రవారం స్వామి పరీక్ష చేయించుకున్నారు. శనివారం ఫలితాల్లో ‘పాజిటివ్‌’ ఉన్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోనే హోంఐసోలేషన్‌లో ఉన్నానన్నారు. ఎటువంటి లక్షణాలు లేవని, ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని