logo

పనులు పూర్తిచేయిస్తేనే టిక్కెట్లు

‘ఏ పార్టీకైనా కార్యకర్తలే అత్యంత కీలకం.వారికోసం ఏం చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాబోయే రెండేళ్లయినా జిల్లాలోని ప్రజాప్రతినిధులు వారికోసం పనిచేయాలి. ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదు.. వారికోసం ఎవరితోనైనా

Published : 30 Jun 2022 02:02 IST

ఈ రెండేళ్లయినా కార్యకర్తల కోసం పనిచేయాలి
వైకాపా ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని
బిల్లులపై కలకలం రేపిన మద్దిశెట్టి వ్యాఖ్యలు

మాట్లాడుతున్న బాలినేని.. వేదికపై మంత్రి సురేష్‌, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, సుధాకర్‌బాబు, రాంబాబు, ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి శిద్దా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, పార్టీ అధ్యక్షుడు బుర్రా, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే మద్దిశెట్టి ప్లీనరీకి హాజరైన కార్యకర్తలు

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ‘ఏ పార్టీకైనా కార్యకర్తలే అత్యంత కీలకం.వారికోసం ఏం చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాబోయే రెండేళ్లయినా జిల్లాలోని ప్రజాప్రతినిధులు వారికోసం పనిచేయాలి. ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదు.. వారికోసం ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధమే’ అని మాజీ మంత్రి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని లింగారెడ్డి ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన వైకాపా జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి తనకు పెద్ద విషయం కాదని..ఉమ్మడి రాష్ట్రంలోనే దానిని వదులుకున్న చరిత్ర తనదని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధిలో సచివాలయాలు, ఆర్‌బీకేల వంటి నిర్మాణాలు కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారని.. బిల్లులు రావనే భయంతో చాలాచోట్ల పట్టించుకోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో గుత్తేదారుకు పురమాయించానని.. జిల్లావ్యాప్తంగా అదే రీతిలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని నిర్మాణాలు చేపట్టి పూర్తిచేయాలని సూచించారు. పూర్తిచేసిన వారికే రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తారన్నారు. ఇటీవల ఒక పథకం ప్రకారం తనపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అప్పులు చేస్తోందంటూ తెదేపా చేస్తున్న విమర్శలను బాలినేని తిప్పికొట్టారు. అత్యంత క్లిష్టకాలంలోనూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాలకు వేశారన్నారు. తెదేపా జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు.

నాయకులు వస్తారు.. పోతారు
మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్‌ శాశ్వత ముఖ్యమంత్రి అన్నారు. పార్టీకి కార్యకర్తలే శాశ్వతమని..తమలాంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని..ఈ విషయాన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అసంతృప్తితో ఉండటం మంచిది కాదన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి మాట్లాడుతూ గడప లోపల అభివృద్ధి ఉంటోందనీ, గడప బయట లేదన్నారు. అటువంటి అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. చేసిన పనులకు బిల్లులు రావడంలేదన్నారు. కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకొని తిరగాలంటే బిల్లులు చెల్లించాలన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సభలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి శిద్దా, ఎమ్మెల్సీలు సునీత, మాధవరావు, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, సుధాకర్‌బాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌, జంకె వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలను ప్రతిపాదించగా, ప్లీనరీ ఆమోదించింది. పదివేలమందికి భోజన ఏర్పాట్లు చేసినప్పటికీ దాదాపు మూడు వేలమంది కార్యకర్తలు మాత్రమే వచ్చారు. ‘సరిగ్గా 2 గంటలకు సమావేశం ముగిద్దాం... ఎవరూ సీట్లలోంచి వెళ్లొద్దు. జనం వెళ్లిపోయారంటారు’ అంటూ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూచించడం గమనార్హం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు