logo

నిమ్జ్‌తో యువతకు ఉపాధి అవకాశాలు

పామూరు, పీసీపల్లి మండలాల్లో ఏర్పాటయ్యే నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌-మ్యానుఫాక్చరింగ్‌ జోన్‌) ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు.

Published : 25 Nov 2022 05:56 IST

ప్రజాభిప్రాయ సేకరణలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌
జీవనాధారం, కాలుష్య సమస్యలను ఏకరవు పెట్టిన రైతులు

మాలకొండాపురంలో సమావేశానికి హాజరైన రైతులు

పామూరు, న్యూస్‌టుడే: పామూరు, పీసీపల్లి మండలాల్లో ఏర్పాటయ్యే నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌-మ్యానుఫాక్చరింగ్‌ జోన్‌) ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. 5,818 హెక్టార్లలో రూ.4,381 కోట్ల పెట్టుబడితో నిమ్జ్‌ను అభివృద్ధి చేసేందుకు పర్యావరణ అనుమతుల నిమిత్తం గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పామూరు మండలం మాలకొండాపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొడవాడ, మాలకొండాపురం, అయ్యన్నకోట, సిద్ధవరం, రేణిమడుగు, పెద్దఇర్లపాడు గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఫార్మాస్యూటికల్స్‌, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ తదితర పరిశ్రమలు మొదటి దశలో వస్తాయని జేసీ చెప్పారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి రిజర్వేషన్‌ కల్పించి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. పశువుల బీడు భూములు పరిశ్రమలకు తీసుకుంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు తెలిపారు. ఆ సమస్య లేకుండా చూస్తామని జేసీ చెప్పారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్‌ భూముల్లో పంటలు పండించుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని.. ఇప్పుడు వాటిని తీసుకుంటే తమకు ఆధారమేమిటని మరికొందరు రైతులు ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తామని జేసీ తెలిపారు.

వేరే చోట భూములు కేటాయించాలి

గ్రామాల చుట్టూ కనీసం 500 మీటర్ల గ్రీన్‌ బఫర్‌జోన్‌ ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చెరువులకు కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు. అలాగే మెరుగైన పరిహారం ఇవ్వాలని, నిమ్జ్‌లో తాము కోల్పోయిన భూములకు బదులుగా వేరేచోట భూములు ఇప్పించాలని కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జేసీ హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నాగిరెడ్డి, కనిగిరి ఆర్డీవో కె.సందీప్‌కుమార్‌.. పామూరు, పీసీపల్లి తహసీల్దార్లు బీఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌, ఎస్‌.వెంకటేశ్వర్లు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని