logo

ఎక్కడున్నా.. వివరణ ఇవ్వండి

ఫిర్యాదు తీసుకున్నారు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు... పలు కేసుల్లో నిందితులకు 41 సీఆర్‌పీసీ అనుసరించి నోటీసులు జారీ చేశారు.

Published : 25 Nov 2022 05:56 IST

సమావేశంలో ఎస్పీ ఆగ్రహం
పలువురు అధికారులకు సంజాయిషీ నోటీసులు

నేరాలపై సమీక్షిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌.. హాజరైన పోలీసు అధికారులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఫిర్యాదు తీసుకున్నారు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు... పలు కేసుల్లో నిందితులకు 41 సీఆర్‌పీసీ అనుసరించి నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆ కేసు పక్కన పడేశారు. కనీస దర్యాప్తు కూడా సాగని ఇటువంటివి ఎన్నో...ఈ తరహా నిర్లక్ష్యంపై ఎస్పీ మలికా గార్గ్‌ ఆగ్రహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో పెద్దసంఖ్యలో సీఐ, ఎస్సైలకు ఛార్జిమెమోలు జారీ చేశారు. పర్యవేక్షణాధికారులైన డీఎస్పీలకూ మెమోలు ఇచ్చారు. గతంలో సదరు సర్కిళ్లు, స్టేషన్లలో పనిచేసి ప్రస్తుతం బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం ఉపేక్షించలేదు. మీ హయాంలో ఆయా కేసుల దర్యాప్తులో ఎందుకు నిర్లక్ష్యం చేశారో వచ్చి వివరణ ఇచ్చి వెళ్లండంటూ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు 200 కేసులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. 2020 సంవత్సరంలో నమోదై ఇప్పటికీ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఒంగోలు సబ్‌ డివిజన్‌లోని వివిధ సర్కిళ్లలో పనిచేసి ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న సీనియర్‌ సీఐకు ఛార్జిమెమో ఇచ్చినట్లు తెలిసింది. సిôగరాయకొండ సర్కిల్‌ పరిధిలోని స్టేషన్‌లో గతంలో పనిచేసిన ముగ్గురు ఎస్సైలకూ వీటిని జారీచేశారు. ఇదే సర్కిల్‌లో టోల్‌ప్లాజాకు సంబంధించిన కేసులో చరవాణిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపడంలో జాప్యం చేసినందుకు గతంలో పనిచేసిన ఇద్దరు సీఐలకు ఛార్జిమెమోలు జారీచేసినట్లు సమాచారం.

మహిళలపై నేరం జరిగితే జీరో ఎఫ్‌ఐఆర్‌

జిల్లాలో మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగితే సంబంధిత పోలీసు అధికారులు సత్వరం స్పందించాలని.. నేర ప్రదేశం తమ పరిధిలోకి రాకపోయినా కచ్చితంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దోపిడీలు, దొంగతనాలు, అదృశ్యం కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. నేర నియంత్రణకు పెట్రోలింగ్‌, రాత్రి గస్తీ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు(అడ్మిన్‌), ఎస్‌.వి.శ్రీధర్‌రావు(క్రైమ్స్‌), ఎన్‌.సూర్యచంద్రరావు(సెబ్‌), అశోక్‌బాబు(ఏఆర్‌), ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు.. ఒంగోలు, దర్శి, మార్కాపురం డీఎస్పీలు యు.నాగరాజు, నారాయణస్వామిరెడ్డి, కిషోర్‌కుమార్‌; డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, డీసీఆర్‌బీ సీఐ పి.దేవప్రభాకర్‌, న్యాయసలహాదారు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు