logo

అటు ఈడీ... ఇటు సీఐడీ

దిల్లీ మద్యం కుంభకోణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు వెలుగు చూడటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

Updated : 05 Dec 2022 10:27 IST

రసవత్తరంగా జిల్లా రాజకీయాలు
చర్చనీయాంశమైన తనిఖీలు.. దాడులు

ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), మరోవైపు నేర పరిశోధన విభాగం(సీఐడీ) జిల్లాపై దృష్టి సారించాయి. దేశ రాజధాని దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్నట్టు తెలుపుతూ అమిత్‌ అరోడా అనే నిందితుడిని ఈడీ అక్కడి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించింది. అందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేరింది. తాజాగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న భూకుంభకోణంపై సీఐడీ దృష్టి పెట్టింది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న భూదందాలపై తమకు అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులకు సీఐడీ తాఖీదులు పంపింది. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాకేంద్రంలో రూ.వందల కోట్ల విలువైన భూములను అత్యంత వివాదాస్పదంగా కొందరికి కట్టబెట్టారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి ఈనాం భూములకు కూడా పట్టాలు సృష్టించిన వైనం ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ నాయకుల ప్రాప్తం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన యంత్రాంగం చిక్కుల్లో చిక్కుకుంది. ఈ వ్యవహారమంతా జిల్లా కేంద్రానిదే కావడంతో అందరి దృష్టి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిపై పడింది.

న్యూస్‌టుడే, ఒంగోలు  నేరవిభాగం

మద్యం కేసులో మాగుంట...: దిల్లీ మద్యం కుంభకోణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు వెలుగు చూడటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తనిఖీలు, ప్రశ్నల పరంపర ఈ కేసులో వేడిని పెంచుతున్నాయి. వైకాపాలో అత్యంత కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్‌ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. నిందితులు సాక్ష్యాలను చెరిపేయడం కోసం వందల సంఖ్యలో చరవాణులను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అమిత్‌ అరోడా అరెస్టు, అతని రిమాండ్‌ రిపోర్టులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరుండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో తనకూ, తన కుమారుడు రాఘవరెడ్డికి ఎటువంటి సంబంధం లేదనీ, తామస్సలు దిల్లీ మద్యం వ్యాపారంలోనే లేమని ఎంపీ మాగుంట చెబుతున్నారు. ఈడీ విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం విస్తుగొలిపేలా చేస్తున్నాయి.

నిన్న పదవి తొలగింపు..  నేడు విచారణ...: రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ దృష్టి పూర్తిగా ప్రతిపక్ష నేతల పైనే ఉంది. అర్ధరాత్రి అరెస్టులు, బెయిళ్లు, జైలు నిత్యకృత్యంగా మారాయి. ఇటువంటి తరుణంలో ఒంగోలులో జరిగిన భూదందాలపై సీఐడీ దృష్టి సారించడం, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో అక్రమాలపై విచారణ రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. గతంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించడం, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఆయన్ను ప్రకాశం, బాపట్ల జిల్లాల బాధ్యతల నుంచి తొలగించటం ఇప్పటికే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో భూ అక్రమాలపై విచారణ సహజంగానే అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒకవైపు ఎంపీ మాగుంటపై ఈడీ, మరోవైపు బాలినేని నియోజకవర్గంలో సీఐడీ విచారణలో ఇప్పుడు జిల్లాలో రాజకీయ చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి.


ఆ తొమ్మిది అంశాలకు సమాధానమివ్వండి...

కొంతకాలంగా ఒంగోలు నగరంలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. వీటిపై సీఐడీ దృష్టి సారించింది. ఒంగోలు తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. భూపందేరానికి సంబంధించి తొమ్మిది అంశాలను ప్రస్తావించింది. వీటిపై సమాధానం ఇవ్వాలని కోరింది..

అవి ఏమిటంటే..: భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు నయీమ్‌ అహ్మద్‌; బి.వి.రమణారావు, కె.చిరంజీవి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ ఒంగోలులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో, ఏ హోదాల్లో పనిచేస్తున్నారు. * ఆ సమయంలో ఒంగోలులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, విలేజ్‌ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన వారి వివరాలు.* సర్వే నెం: 138, 264-పి, 264-పి1 సంఖ్యలోని భూములకు అసలైన యజమానులు ఎవరు.. యాజమాన్య హక్కులు ఎలా సంక్రమించాయి. ‌*  ప్రభుత్వానివా, ప్రైవేట్‌వా..?* పట్టాలు కేటాయించడానికి రెవెన్యూ అధికారులకు ఎంతమేరకు అధికారం ఉంది.* ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి.* ఆ భూములను సబ్‌ డివిజన్‌ ఎలా చేశారు.. అందుకు సంబంధించి సర్వేయర్‌, వీఆర్వో, ఆర్‌ఐ తయారుచేసిన స్కెచ్‌లు, రికార్డులు ఉన్నాయా.

* ఆర్‌ఎస్‌ఆర్‌ మేరకు సర్వే నెం: 138, 264, 267లో భూములను ఈనాంగా చూపారు. ఆ తర్వాత వాటిని సబ్‌ డివిజన్లుగా మార్చి పలువురికి పట్టాలు కేటాయించారు. ఈనాంగా చూపిన వాటిని డ్రై, ప్రభుత్వ భూములుగానూ చూపారు. ఇదెలా జరిగింది. వాటిని వెబ్‌ ల్యాండ్‌లో ఎలా నమోదు చేశారు. కేటాయింపులో ప్రమేయం ఉన్న రెవెన్యూ అధికారుల పేర్లు ఇవ్వగలరు.* యజమాని ఎవరన్నది వివరాలు లేకుండా ఖాతా నెం: 9099లో 0.02 సెంట్ల భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎలా నమోదు చేశారు. ఈ భూమి మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నది ఎవరు.

* అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు...: తమ తొమ్మిది అంశాలకు సంబంధించిన వివరాలతో ఈ నెల తొమ్మిదో తేదీలోపు విచారణకు హాజరుకావాలని రెవెన్యూ అధికారులకు సీఐడీ తాఖీదులు జారీ చేసింది. రెవెన్యూ అధికారుల చర్యలతో లాభపడింది ఎవరైనా, మొత్తానికి ఇరుకున పడింది మాత్రం అధికార యంత్రాగమే. ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు లొంగి వ్యవహరించారు. వివాదాస్పద భూములకు అడ్డగోలుగా పట్టాలు జారీ చేశారు. తద్వారా లాభం పొందినవారుండగా, ఆ కేటాయింపులు చేసిన అధికారులు మాత్రం దోషుల్లా నిలవాల్సి వచ్చింది. వీరిపై వచ్చిన అభియోగాలు రుజువైతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని