logo

ఆటోలు ఢీ కొని..

త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం సమీపంలో బుధవారం ఆటోలు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 02 Feb 2023 03:37 IST

ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు

క్షతగ్రాతులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

త్రిపురాంతకం, యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే : త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం సమీపంలో బుధవారం ఆటోలు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురానికి  చెందిన 14 మంది కూలీలు త్రిపురాంతకం మండలంలోని లేళ్లపల్లిలో మిరప కోతల పనులకు బయలుదేరారు. మిట్టపాలెం సమీపంలో రేళ్లపల్లె రహదారిలో ఎదురుగా వస్తున్న ఒక ఖాళీ ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి.  ఈ ఘటనలో కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారంతా సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ప్రమాదంలో సుంకరి చిన్న శ్రీను(40)తో పాటు రవణ, నారాయణమ్మ, నాగమణి, పున్నమ్మ, సుందరమ్మ, బాదరమ్మ, కొండమ్మ, బాదరమ్మ తీవ్రంగా గాయపడగా మరికొంత మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది  సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే చిన్న శ్రీను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్న శ్రీను భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకట సైదులు తెలిపారు.

మృతి చెందిన  చిన్న శ్రీను

కుటుంబ పెద్దను కోల్పోయి.. ఆటో డ్రైవర్‌ పక్కనే కూర్చున్న సుంకరి చిన్న శ్రీను మృతి చెందగా, ఆదే ఆటోలో ఉన్న అతని భార్య కొండమ్మ తీవ్రంగా గాయపడి వై.పాలెం ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతోంది. వీరికి నలుగురు కుమార్తెలు.  శ్రీను బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్య మిర్చి కోతలకు భార్యతో కలిసి వెళ్తున్నాడు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా చేయాలన్న అతని కల నెరవేర్చకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పనికి వెళితే కాని పూట గడవని స్థితిలో ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని