logo

బటన్‌ నొక్కుడు ఇంకెప్పుడు!

నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా అమలు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చేపట్టిన కసరత్తు పూర్తయింది.

Published : 06 Feb 2023 01:51 IST

అక్కా చెల్లెమ్మలకు ఇంకా అందని ఆసరా
మూడో విడత రుణ మాఫీకి ఎదురు చూపులు

ఒంగోలు మండలంలో సమావేశమైన స్వయం సహాయక సంఘం సభ్యులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా అమలు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చేపట్టిన కసరత్తు పూర్తయింది. రుణ మాఫీ సాయం జమ చేసేందుకు బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి అనే నిబంధన పెట్టారు. ఈ మేరకు డిసెంబరు నెలాఖరుకు జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతగా అర్హులైన సంఘాల మహిళల ఖాతాలకు 2020 సెప్టెంబర్‌లో; రెండో విడత 2021 అక్టోబరులో రుణ మాఫీ నగదు జమ చేశారు. ఇక మూడో విడత ఈ ఏడాది జనవరిలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని గత నెల మొదటి, రెండు వారాల్లో జమ చేస్తారని అంతా భావించినప్పటికీ.. ఫిబ్రవరి వచ్చినా ఆ ఊసే లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నిధులు జమ చేయడం కోసం సంఘాల మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పారదర్శకం పేరుతో ప్రత్యేక యాప్‌...: ‘స్వయం సహాయక సంఘాల మహిళలు 2019 ఏప్రిల్‌ 11 నాటికి తీసుకుని బకాయి ఉన్న బ్యాంక్‌ లింకేజీ రుణాలను వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో మాఫీ చేస్తాం..’ ఇదీ నవరత్నాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. అందులో భాగంగా గత రెండేళ్లుగా రెండు విడతల్లో కొంత జమ చేయగా.. తాజాగా మూడో విడత అమలుకు జిల్లా అధికార యంత్రాంగం తుది ప్రక్రియ పూర్తి చేసింది. మరింత పారదర్శకతలో భాగంగా ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కొన్ని మార్పులూ చేశారు. అందుకు ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

5.80 లక్షల మంది సభ్యులు...: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పట్లో 58,006 స్వయం సహాయక సంఘాలుండగా; వీటిలో 5.80 లక్షల మంది సభ్యులున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ.1,804.34 కోట్ల రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. ఈ మొత్తాన్ని ఆసరా పథకంలో భాగంగా అందించే రుణ మాఫీ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేయాలని భావించారు. రెండో విడత కింత గత ఏడాది రూ.455.44 కోట్ల నగదును బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారు. తొలి విడత రుణ మాఫీ అమలులోనే సంఘాల వారీగా రుణ మొత్తం, మహిళల బ్యాంక్‌ పొదుపు ఖాతా వివరాలు సేకరించి జమ చేశారు. అప్పట్లో కొన్ని సంఘాలకు చెందిన లీడర్లు.. తక్కువ మొత్తంలోనే జమ అయిందంటూ మిగతా మహిళలకు నగదు తగ్గించి ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సభ్యురాలి వాటా ప్రకారం వ్యక్తిగత పొదుపు ఖాతాలో జమ చేసేలా బ్యాంకర్లకు అవకాశం ఇచ్చారు. ఈ సారి కూడా వ్యక్తిగత ఖాతాలకు జమ చేసేలా ఆదేశాలందాయి. అయితే ఫిబ్రవరి వచ్చినా ఆ నగదు అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని