logo

బతుకులోనూ.. మృత్యువులోనూ కలిసే

వారిద్దరూ అన్నదమ్ములు. స్నేహితుల్లా ఉండేవారు.. ఏ పనైనా కలిసే చేసేవారు..కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తొలుత తమ్ముడు గుండెపోటుకు గురై కన్నుమూయగా గుండెలవిసేలా రోదించి అన్న కూడా కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

Published : 07 Feb 2023 02:54 IST

తమ్ముడి అకాల మరణంతో ఆగిన అన్న గుండె

పెద్దారవీడు, న్యూస్‌టుడే: వారిద్దరూ అన్నదమ్ములు. స్నేహితుల్లా ఉండేవారు.. ఏ పనైనా కలిసే చేసేవారు..కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తొలుత తమ్ముడు గుండెపోటుకు గురై కన్నుమూయగా గుండెలవిసేలా రోదించి అన్న కూడా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంట వ్యవధిలోనే వరుసగా జరిగిన ఈ ఘటనలతో పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి తల్లడిల్లింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. .గ్రామానికి చెందిన బీరెడ్డి పెద్ద అల్లూరిరెడ్డి(67), చిన్న అల్లూరిరెడ్డి(65) అన్నదమ్ములు. కొన్నాళ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్న అల్లూరిరెడ్డికి సోమవారం తెల్లవారుజామున గుండె పోటు రావడంతో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందారని వివరించారు. సమాచారం తెలిసి అన్న పెద్ద అల్లూరిరెడ్డి తీవ్రంగా విలపించారు. ఈ క్రమంలోనే ఆయన కూడా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం ఇటు బంధువులను, స్థానికులను కలచివేసింది.

కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ..

అన్నదమ్ములిద్దరికీ చెరో అయిదెకరాల చొప్పున పొలం ఉండేది. సాగులో నష్టం రావడంతో తెచ్చిన అప్పులు తీర్చేందుకు రెండేళ్ల క్రితం పొలాన్ని అమ్మేశారు. చెరో ఎకరా కౌలుకు తీసుకుని పత్తి పంట వేశారు. మూడేళ్ల క్రితం వీరి సోదరుడైన మాజీ సర్పంచి బీరెడ్డి మల్లారెడ్డి వ్యవసాయం కలిసి రాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దుఃఖం నుంచి కోలుకొని ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ సాగిపోతున్న వీరు ఒకేరోజు చనిపోవడం విషాదం.. పెద్ద అల్లూరిరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా.. చిన్న అల్లూరిరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని