logo

నేర వార్తలు

ఒంగోలు మండలం వలేటివారిపాలెం వద్ద 2016లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడికి జైలు శిక్ష విధించారు.

Published : 08 Feb 2023 02:55 IST

హత్య కేసులో జీవిత శిక్ష

ఒంగోలు గ్రామీణం: ఒంగోలు మండలం వలేటివారిపాలెం వద్ద 2016లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడికి జైలు శిక్ష విధించారు.  పోలీసుల కథనం ప్రకారం.. గుండాయపాలేనికి చెందిన వలేటి వెంకటేశ్వరమ్మ(50) 2016లో రొయ్యల విక్రయ నిమిత్తం వలేటివారిపాలేనికి వచ్చి అక్కడి నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఆమెపై దాడి జరిగింది. తన కూతురు, అల్లుడి మధ్య గొడవను ఆమె ప్రోత్సహిస్తోందన్న అనుమానంతో గొల్లపోతు కృష్ణ తన అక్క వెంకటేశ్వరమ్మను తాడుతో  మెడకు బిగించి హత్య చేశాడు. దీనిపై అప్పట్లో తాలుకా సీఐ ఆంథోనిరాజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పత్రాలు సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన 8వ ఏడీజే అమ్మన రాజా నిందితుడు గొల్లపోతు కృష్ణకు జీవిత కాలం జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్‌ అభినందించారు.


గిద్దలూరులోని మూడు ఇళ్లల్లో చోరీలు
రూ.3.2 లక్షల సొత్తు దొంగతనం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు నగర పంచాయతీలో సోమవారం రాత్రి తాళంవేసి ఉన్న మూడు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు .. గిద్దలూరు నగర పంచాయతీ వివేకానంద కాలనీలో నివాసముండే పూజారి కె.శ్రీనివాసులు ఈ నెల 1న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఉంది. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువు రూ. 3.2 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పట్టణంలోని అంకాళ్లమ్మవీధిలో నివాసముండే శేగు మోహన్‌రావు ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లారు. సోమవారం రాత్రి ఆ ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి బీరువా పగులగొట్టగా .. అందులో విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. గిద్దలూరు - నంద్యాల రహదారిలోని మరో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. సదరు ఇంటి యజమాని వివరాలు తెలియరాలేదు. చోరీలు జరిగిన ఇళ్లను  గిద్దలూరు సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, మార్కాపురం క్లూస్‌టీమ్‌ సిబ్బంది పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దుప్పి మాంసం స్వాధీనం

రాచర్ల, న్యూస్‌టుడే : చినగానిపల్లిలో దుప్పి మాంసాన్ని కలిగివున్న ముగ్గురు వ్యక్తులను ఆటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. డీఆర్వో మాధవరావు కథనం ప్రకారం .. చినగానిపల్లికి చెందిన ఏసెపోగు దినేష్‌కుమార్‌ తన పొలానికి విద్యుత్తు కంచె ఏర్పాటు చేయగా, తీగలు తగిలి చుక్కల దుప్పి చనిపోయింది. దుప్పి కళేబరాన్ని దినేష్‌కుమార్‌తో పాటు ఈర్నపాటి కుమార్‌, వై.ప్రదీప్‌కుమార్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుప్పిని కోసి మాంసాన్ని గ్రామంలోకి తీసుకురాగా, సమాచారం అందుకున్న తురిమెళ్ల రేంజ్ అధికారిణి మధుప్రియాంక, ఇతర అధికారులు విచారించి స్వాధీనం చేసుకున్నారు. మాంసంతో పాటు తల, చర్మం, కొమ్ములు, కత్తులు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్వో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని