logo

‘డబ్బులడిగితే ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు’

‘రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పి రూ. 2 కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులడిగితే ఆ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు.

Published : 21 Mar 2023 06:19 IST

మంత్రి నాగార్జునకు ఫిర్యాదు చేస్తున్న దళిత సంఘాల నాయకులు సుజన్‌ మాదిగ, వెంగళరావు తదితరులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పి రూ. 2 కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులడిగితే ఆ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయిస్తున్నారు..’ అని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబుపై దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాగార్జునను వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం వారు కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నిరుపేద దళితుడైన కావూరి దేవదాస్‌కు మద్దిపాడు మండలం బూరేపల్లి గ్రామ సర్వే నంబర్‌: 456లో 1992లో 2.98 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అతని కుటుంబం ఆ భూమి పైనే ఆధారపడి జీవనం సాగిస్తోందన్నారు. సుధాకర్‌బాబు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బూరేపల్లి గ్రామ సర్పంచి శేషయ్య, మద్దిపాడుకు చెందిన అనిల్‌ అనే వ్యక్తులు దేవదాస్‌తో సంప్రదింపులు సాగించినట్టు చెప్పారు. భూమిలో గ్రావెల్‌ తవ్వుకునేందుకు అనుమతిస్తే ప్రతిఫలంగా ఎమ్మెల్యే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పడంతో దేవదాస్‌ అంగీకరించారన్నారు. రెండెకరాల్లో సుమారు 20 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి రూ.రెండు కోట్ల విలువైన గ్రావెల్‌ అమ్ముకున్నట్టు తెలిపారు. అనంతరం దేవదాస్‌ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వద్దకు వెళ్లి ముందుగా చెప్పినట్టు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరగా ఆయన కోపోద్రిక్తుడయ్యారన్నారు. ఎంత ధైర్యం ఉంటే తననే డబ్బులు అడుగుతావంటూ భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా అప్పటి మద్దిపాడు ఎస్సైను తరచూ ఇంటికి పంపి వేధింపులకు గురిచేసినట్టు మంత్రి నాగార్జునకు వివరించారు. దీనికి స్పందించిన మంత్రి నాగార్జున త్వరలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్టు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్‌ మాదిగ, దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జండ్రాజుపల్లి ఆంజనేయులు తదితరులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు