logo

స్నాప్‌ల కళ.. హాకీలో భళా

వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. వసతులు లేకున్నా హాకీపై ఆసక్తి కొద్దీ  నిత్యం శ్రమిస్తూ ముందడుగు వేస్తున్నారు.

Updated : 24 Mar 2023 05:45 IST

అదరగొడుతున్న పేద విద్యార్థులు
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

శిక్షణలో విద్యార్థులు

న్యూస్‌టుడే, చీమకుర్తి, సంతనూతలపాడు: వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. వసతులు లేకున్నా హాకీపై ఆసక్తి కొద్దీ  నిత్యం శ్రమిస్తూ ముందడుగు వేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి పీˆఈటీ రవికుమార్‌ శిక్షణ తోడవడంతో వారు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు దక్షిణ భారత స్థాయి హాకీ పోటీలకు ఎంపికై తమ సత్తా చాటుతున్నారు. కష్టసాధ్యమైన స్నాప్‌, రిస్ట్‌ షాట్‌లను ఆడుతూ ఔరా అనిపిస్తున్నారు. చీమకుర్తి మండలంలోని కె.వి.పాలేనికి చెందిన పడిదపు కార్తీక్‌, గుడిపూడివారిపాలేనికి చెందిన కల్లూరి వాసు, మైనంపాడు నివాసి తన్నీరు శ్రీవాణి ఈ నెల 19 నుంచి 26 వరకు తమిళనాడులోని రామనాథపురంలో జరుగుతున్న సౌత్‌జోన్‌ జూనియర్‌ హాకీ పోటీల్లో పాల్గొంటున్నారు.


బేల్దారు కుటుంబంలో పుట్టి...

సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చెందిన తన్నీరు సాయి శ్రీవాణి హాకీలో సత్తా చాటుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె పీఈటీ రవికుమార్‌ వద్ద హాకీలో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా రాణిస్తున్నారు. అమ్మా నాన్న వనిత, పోతురాజులు బేల్దారు కూలీలు. అరకొర వసతులున్నా .. దాతల ప్రోత్సాహంతో పాఠశాల వద్ద మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. యలమంచిలి, అనంతపురంలో జరిగిన సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొన్నారు. సబ్‌ జూనియర్‌ కేటగిరీలో చాటిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తమిళనాడులోని రామనాథపురంలో జరుగుతున్న దక్షిణ భారత స్థాయి జూనియర్‌ హాకీ పోటీల్లో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో మంచి హాకీ క్రీడాకారిణిగా ఎదగాలన్నది తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.


ఆరేళ్లుగా అహరహం శ్రమిస్తూ...

చీమకుర్తి మండలం కేవీపాలేనికి చెందిన పడిదపు కార్తీక్‌ ఆరేళ్లుగా హాకీలో ప్రతిభా కాంతులీనుతున్నారు. గోనుగుంట జడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పీఈటీ రవికుమార్‌ వద్ద శిక్షణ పొందారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అమ్మ వరలక్ష్మి, నాన్న శ్రీను రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఒడ్డెక్కుతున్నారు. ఇప్పటివరకు అయిదుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అనంతపురంలో అండర్‌-17, తిరుపతిలో అండర్‌-19, 2020 సత్యసాయి జిల్లా ధర్మవరంలో జూనియర్‌ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటారు. 2022 అనకాపల్లిలోను, 2023 నంద్యాలలో జరిగిన జూనియర్‌ హాకీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో హాకీ ఇండియా ఆధ్వర్యంలో జరిగే జూనియర్‌ సౌత్‌జోన్‌ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడల్లో రాణించి మంచి పేరు పొందడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలన్న లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు ఆయన చెప్పారు.


ఉత్తమ క్రీడాకారుడిగా రాణించాలని..

చీమకుర్తి మండలం గుడిపూడివారిపాలేనికి చెందిన నారాయణ, అంజయ్యల కుమారుడు కల్లూరి వాసు జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. గోనుగుంట జడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి హాకీ క్రీడను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఒంగోలు ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రాష్ట్ర పాఠశాల క్రీడల ఆధ్వర్యంలో  జరిగిన పోటీల్లో అయిదుసార్లు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. అండర్‌-14 స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లోను, అనంతరం ధర్మవరం, అనంతపురం, విశాఖపట్నంలో జరిగిన సబ్‌ జూనియర్స్‌ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటారు. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.


160 మందికి శిక్షణ అందించా

ప్రతి విద్యార్థి క్రీడలను నేర్చుకొని ప్రతిభ చాటాలన్న లక్ష్యంతో వారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నా. చీమకుర్తి మండలం గోనుగుంటలో ఏడేళ్లపాటు పనిచేశా. తాను పనిచేసిన కాలంలో సుమారు 160 మందికి పైగా విద్యార్థులు హాకీ క్రీడలో రాష్ట్ర స్థాయి పోటీల్లోను, ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని రాటుదేలేలా చేశా. ప్రస్తుతం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  పనిచేస్తున్నా. నా మార్గనిర్దేశంలో ఇప్పటి వరకు సుమారు 60 మంది విద్యార్థులు హాకీలో రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. హాకీ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్‌జోన్‌ జూనియర్‌ హాకీ ఏపీ బాలికల జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నా. - రవికుమార్‌, పీఈటీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని