logo

నేడు కారుమంచికి సీఎం జగన్‌

ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం రానున్నారు.

Published : 27 Mar 2023 04:09 IST

పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌,

స్పెషల్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారి రంగబాబు తదితరులు

ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం రానున్నారు. వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు, బాపట్ల జిల్లా వైకాపా సీనియర్‌ నాయకుడు, నేత్ర వైద్యుడు డాక్టర్‌ అమృతపాణిల తల్లి కోటమ్మ(82) వృద్ధాప్యం కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం అయిన టంగుటూరు మండలం కారుమంచిలో అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. కోటమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు సీఎం జగన్‌ రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు కావడంతో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, స్పెషల్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారి ఎ.ఎన్‌.రంగబాబుతో కలిసి కారుమంచి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు సీఎం హెలికాఫ్టర్‌లో కారుమంచి చేరుకోనున్నట్టు ప్రాథమిక సమాచారం. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్‌ క్రీడా ప్రాంగణం వద్ద కోటమ్మ భౌతికకాయానికి ముఖ్యమంత్రి, ఇతర నాయకులు నివాళులు అర్పిస్తారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌ నుంచి ప్రాంగణానికి వెళ్లే మార్గంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, రవాణా, విద్యుత్తు, అగ్నిమాపక శాఖలతో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పర్యటన షెడ్యూల్‌ ఇలా...

సోమవారం ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరుతారు. 10.55కు టంగుటూరు మండలం కారుమంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గంటల వరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడతారు. 11.15కు రోడ్డు మార్గాన అంబేడ్కర్‌ క్రీడా ప్రాంగణానికి చేరుకుని వరికూటి కోటమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారు. వరికూటి అశోక్‌బాబు, అమృతపాణి కుటుంబీకులను పరామర్శిస్తారు. 11.45కు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.05కు హెలిప్యాడ్‌ వద్ద స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు. 12.10 గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని