logo

కీలుబొమ్మల స్వామిభక్తి

ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు.

Published : 28 Mar 2024 02:19 IST

వాలంటీర్ల గ్రూపుల్లో రాజకీయ ప్రచారం
పర్యవేక్షణ విస్మరించిన అధికార యంత్రాంగం
గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే

ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. ఎన్నికల విధులు, ప్రచారంలో పాల్గొనరాదనే ఎన్నికల సంఘం ఆదేశాలకు నిలువునా నీళ్లొదులుతున్నారు. అధికార పార్టీ చేతిలో ‘కీ’లుబొమ్మలుగా మారారు. స్వామిభక్తి ప్రదర్శనలో పోటీ పడుతున్నారు. ఈసీ ఆదేశాల అమలును పర్యవేక్షించాల్సిన అధికారులేమో తమకేమీ తెలియదన్నట్లు నటిస్తూ చోద్యం చూస్తున్నారు.

ఒత్తిడి తెస్తూ.. చేర్పిస్తూ...: గిద్దలూరు నియోజకర్గంలోని పలువురు గ్రామ, వార్డు వాలంటీర్లు బరితెగింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. తమ ప్రాంతాల్లో విస్తృతంగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారు. వైకాపా అభ్యర్థి అనుచరులు, నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌ గ్రూపుల పేరిట ప్రచార పర్వానికి తెర లేపారు. వాలంటీర్ల పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన ఫోన్‌ నంబర్లతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందులో వైకాపా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎవరైనా గ్రూపుల్లో చేరకుంటే బెదిరింపులకు గురిచేస్తున్నారు. మీతోపాటు మరో పదిహేను మందిని చేర్పించండంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ గ్రూపుల్లో శభాష్‌ వాలంటీర్‌.. మీ సాహసానికి వందనం, పార్టీకి మీరందించే సేవలు మరువలేనివి, రాజీనామాలు చేసిన వారిని ఎన్నికల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటూ వైకాపా నాయకులు పోస్టులు పెడుతున్నారు. గిద్దలూరు మండలం కంచిపల్లె సచివాలయం గ్రూప్‌లో అయితే మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి చిత్రంతో చేపట్టనున్న ర్యాలీ చిత్రాన్ని పోస్టు చేశారు. వాలంటీర్లను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలు, నగర పంచాయతీ కమిషనర్‌లు ఈ విషయాలేవీ పట్టించుకోవడం లేదు. వాలంటీర్ల గ్రూపులపై ఎన్నికల అధికారులు కనీసం పర్యవేక్షించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని