logo

డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్‌

పశ్చిమంలోని కీలకమైన పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు  దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు.

Updated : 28 Mar 2024 09:07 IST

‘పురం’లో పాతుకుపోయి విధులు
అధికార పార్టీ ముఖ్యనేతకు వేగులు
ప్రతిపక్షాల సమాచారం చేరవేతలు
న్యూస్‌టుడే, మార్కాపురం నేర విభాగం

పశ్చిమంలోని కీలకమైన పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు  దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల ప్రచార అనుమతులతో పాటు ఇతర ముఖ్య విషయాలకు మోకాలడ్డుతున్నారు. సంబంధిత సమాచారాన్ని క్షణాల్లో వైకాపా నేతలకు చేరవేస్తున్నారు. ఓ కానిస్టేబుల్‌ హయాంలో ఇప్పటికి ఎనిమిది మంది డీఎస్పీలు మారి... తొమ్మిదో అధికారి వచ్చారు. అయినప్పటికీ అతన్ని కదిలించలేకపోయారు. ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తూ అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు.

అధికారి హోదాలో అజమాయిషీ...: సాధారణంగా ఓ కానిస్టేబుల్‌ డీవో పరిమిత కాలం మూడు నుంచి అయిదేళ్లు ఉంటుంది. ఏవైనా ఆరోపణలు వస్తే మధ్యలోనే బదిలీ చేస్తుంటారు. మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో పని చేసే ఓ కానిస్టేబుల్‌ మాత్రం ఇందుకు విరుద్ధం. ఎలాంటి డీవోలు, అటాచ్‌మెంట్లు లేకుండా కేవలం డీఎస్పీల ప్రాప్తంతో డూయింగ్‌ డ్యూటీ అంటూ ఏకంగా పదమూడేళ్లుగా పాతుకుపోయారు. 2010-15లో కంభం, 2015-20 త్రిపురాంతకం పూర్తి చేసుకుని నాలుగేళ్ల క్రితం పెద్దారవీడు పోలీస్‌ స్టేషన్‌కి ఆయన్ను కేటాయించారు. అయినప్పటికీ డీఎస్పీ కార్యాలయంలోనే డూయింగ్‌ డ్యూటీ పేరుతో కొనసాగుతున్నారు. పదమూడేళ్లుగా లా అండ్‌ ఆర్డర్‌ విధులకు దూరంగా ఉండి అధికారి హోదాలో విధులు వెలగబెడుతున్నారు. ఈ విషయం సొంత శాఖలో చర్చనీయాంశమైంది.

ఏడాదిన్నరగా సీసీ పోస్టు ఖాళీ...: సాధారణంగా డీఎస్పీ స్థాయి కార్యాలయాల్లో సీసీలు అన్ని కార్యక్రమాలు చూస్తుంటాంటారు. మార్కాపురంలో సంబంధిత కుర్చీ ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదే అదునుగా సదరు ‘లోకల్‌’ కానిస్టేబుల్‌ కీలక వ్యవహారాలను అనధికారికంగా తానే చక్కబెడుతున్నారు. కీలక అధికారి సెలవుపై వెళ్లినప్పుడు తానే షాడోగా మారతారనే విమర్శలున్నాయి. ఓ ఏఎస్సై కూడా అటాచ్‌మెంట్‌ మెమోపై డీఎస్పీ కార్యాలయంలోనే తొమ్మిదేళ్లుగా కొనసాగుతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు పలు తీవ్రమైన నేరాలకు సంబంధించిన వాటిపై ఈయన ఆసక్తి చూపుతుంటారు. వాటిల్లో తీవ్రతను బట్టి చేతివాటం ప్రదర్శిస్తుంటారనే ఆరోపణలున్నాయి.

రాజకీయాల్లోనూ తల దూరుస్తూ..: డీఎస్పీ కార్యాలయంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కానిస్టేబుల్‌, ఏఎస్సైలకు వైకాపా నేతల అండదండలున్నాయి. దీంతో వారు స్వామిభక్తి చాటుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే రాజకీయ సభల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు, ఇతర ముఖ్య కేసుల పరిణామాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతకు చేరవేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతిపక్ష నాయకులు కార్యాలయానికి వచ్చే సమాచారం కూడా వెంటనే అధికార పక్ష నేతకు అందిస్తారని ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్థానిక సర్కిల్‌ అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేసే మరో కానిస్టేబుల్‌ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. స్థానికుడు కావడంతో ఇక్కడి రాజకీయ వ్యవహారల్లో తల దూరుస్తున్నారంటూ ఆ శాఖలోనే పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని