logo

కనిష్ఠ స్థాయికి రామతీర్థం

ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్‌లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది.

Published : 29 Mar 2024 01:47 IST

అడుగంటిన రామతీర్థం జలాశయం

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్‌లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. తాగునీటి అవసరాల కోసం ఈ నెల 4 నుంచి రామతీర్థం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులోని రెండు వేసవి నీటి నిల్వ చెరువులతోపాటు చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, ఒంగోలు గ్రామీణం, కొత్తపట్నం మండలాల్లోని సుమారుగా 20 తాగునీటి చెరువులను ఈ  నీటితో నింపారు. ప్రారంభ సమయంలో నీటిమట్టం 79.82 మీటర్లుగా ఉంది. క్రమంగా తగ్గుతూ వచ్చి గురువారం సాయంత్రానికి కనిష్ఠస్థాయి అయిన 74.93 మీటర్లకు చేరింది. దీంతో అవుట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ గేట్ల ద్వారా దిగువకు నీటి ప్రవాహం ఆగిపోయింది.  కందుకూరు, కనిగిరి సీపీడబ్ల్యూ పథకాలకు మాత్రమే సుమారుగా 11 క్యూసెక్కుల నీరు పోతోంది.

ఏప్రిల్‌లో నింపకుంటే..: భవిష్యత్తు తాగునీటి అవసరాల దృష్ట్యా రామతీర్థం జలాశయాన్ని తిరిగి సాగర్‌ జలాలతో నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్‌ మొదటి వారంలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ జలాలతో  ముందుగా రామతీర్థం నింపే దిశగా కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. లేని పక్షంలో ఒంగోలు నగర వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామవాసుల దాహం కేకలు మిన్నంటే ప్రమాదం పొంచివుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని