logo

రాహుల్‌.. సాధించి చూపెన్‌

దేశంలోనే అత్యున్నత సర్వీస్‌.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్‌ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి.

Published : 18 Apr 2024 03:23 IST

సివిల్స్‌లో మెరిసిన మొగుళ్లూరు యువకుడు
కనిగిరి, న్యూస్‌టుడే

తల్లిదండ్రులు రత్నకుమార్‌, వయోలారాణి, సతీమణి ప్రియాంకలతో రాహుల్‌ కుమార్‌

దేశంలోనే అత్యున్నత సర్వీస్‌.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్‌ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. మెరికల్లాంటి అభ్యర్థుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని అంచెలంచెలుగా అధిగమించి ముందు వరుసలో నిలవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఒత్తిడిని తట్టుకునే ఓర్పు ఉండాలి. విఫలమైనా తిరిగి సాధించాలనే బలమైన సంకల్పాన్ని ఒంటబట్టించుకోవాలి. అంతకుమించి అకుంఠిత దీక్ష, కఠోరశ్రమ అవసరం. ఈ లక్షణాలున్నందునే వెలిగండ్ల మండలం మొగుళ్లూరుకు చెందిన వంగేపురం రాహుల్‌ కుమార్‌ సివిల్స్‌ సాధించి చూపారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 504 ర్యాంకుతో మెరిశారు.

చిన్న నాటి నుంచే లక్ష్య నిర్దేశం...: రాహుల్‌ కుమార్‌ స్వగ్రామం వెలిగండ్ల మండలం మొగుళ్లూరు. తండ్రి వంగేపురం రత్నకుమార్‌ పశు సంవర్ధక శాఖలో తాత్కాలిక ఉద్యోగి. తల్లి వయోలారాణి కనిగిరి మున్సిపాలిటీ చింతలపాలెం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఉద్యోగరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నారు. రాహుల్‌ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కనిగిరి సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌, 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు కనిగిరి ప్రగతి విద్యానిలయం, ఇంటర్మీడియట్‌ నెల్లూరు నారాయణ కళాశాల, బీటెక్‌ కాకినాడ జేఎన్‌టీయూలో పూర్తిచేశారు. తల్లిదండ్రుల మాటలతో సివిల్స్‌ సాధించాలని చిన్ననాటి నుంచే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

అపజయాలే గెలుపు మెట్లు...

ఇంజినీరింగ్‌ విద్య పూర్తయిన తర్వాత రాహుల్‌ సివిల్స్‌ శిక్షణ కోసం దిల్లీ వెళ్లారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సన్నద్ధమయ్యారు. రోజుకు 7 నుంచి 9 గంటలపాటు చదివేవారు. మొదటి నాలుగు ప్రయత్నాల్లో అతన్ని పరాజయాలే పలకరించాయి. కొన్నిసార్లు ప్రిలిమ్స్‌లో, మరికొన్ని సార్లు ముఖాముఖి వరకు వెళ్లి వెనుదిరగాల్సి వచ్చింది. అయినప్పటికీ అతను నిరాశ పడలేదు. తానెక్కడ విఫలమవుతున్నదీ విశ్లేషించుకున్నారు. అపజయాలనే గెలుపు మెట్లుగా మలుచుకున్నారు. ఈ ఏడాది అయిదో ప్రయత్నంలో విజయం సాధించారు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలోనే రాహుల్‌కు ప్రియాంక అనే యువతితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఇన్నాళ్ల తన ప్రస్థానంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని.. భార్య అందించిన సహకారం కూడా ఎంతగానో ఉందంటారు. ఓటముల వేళ నిరాశ దరి చేరకుండా ఒత్తిళ్లను అధిగమించడానికి వారెంతగానో దిశానిర్దేశం చేసినట్లు చెబుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని