logo

బానిస పోలీసులపై వేటు

పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్‌ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్‌ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్‌ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు.

Published : 01 May 2024 03:09 IST

దొడ్లో నుంచి విధుల్లోకి కానిస్టేబుళ్లు
చర్యలపై పుత్రరత్నం హూంకరింపు
ఒంగోలు, న్యూస్‌టుడే

పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్‌ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్‌ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్‌ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. సదరు పుత్రరత్నానికి కారు డ్రైవర్‌గా వ్యవహరిస్తూ దొరికిపోయారు. పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసినా ఆ మాజీ అమాత్యుడి దొడ్లో మాత్రం సదరు సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. అమాత్యగిరీ ఊడి రెండున్నరేళ్లు దాటినా జిల్లాలోని తన నివాసంతో పాటు విజయవాడలోని ఇంటిలోనూ హోంగార్డును వ్యక్తిగత సేవలకు వినియోగించుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత బయటపడింది. ఈ విషయాలను తెలుపుతూ ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. మరొకరి పైనా వేటుకు రంగం సిద్ధం చేసింది. ఒంగోలు, విజయవాడల్లోని మాజీ అమాత్యుని నివాసం ఆర్డర్లీ విధుల్లో ఉన్న హోంగార్డులను వెనక్కి పిలిపించింది.

యూనిఫాం ధరించేందుకు విముఖం...: జిల్లా పోలీసు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లినా సదరు హోంగార్డులు తిరిగి విధుల్లోకి వచ్చేందుకు తొలుత ససేమిరా అన్నారు. మా తరపున పీఏ సారు మాట్లాడుతారంటూ మొండికేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అర్డర్లీ విధుల్లోనే కొనసాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఏళ్ల విరామం తర్వాత యూనిఫారం ధరించి విధులకు హాజరుకావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా పోస్టల్‌ బ్యాలెట్ల సేకరణలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బహిరంగంగా ప్రకటించారు. అయినా ఆయన్ను ఇటీవల వరకు స్పెషల్‌ బ్రాంచిలో అదీ ఒంగోలులోనే కొనసాగించారు. ఈ విషయం కూడా వెలుగులోకి రావటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను దోర్నాల చెక్‌పోస్టు వద్ద విధులకు పంపారు. ఈ చర్యలపై అధికార పార్టీ నేతలు ఆగ్రహించినట్లు తెలిసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హూంకరించినట్లు సమాచారం. తాము ఎన్నికల నియమావళి మేరకు మాత్రమే చర్యలు తీసుకున్నామని అధికారులు కూడా గట్టిగానే బదులిచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని