logo

దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత

ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది.

Published : 01 May 2024 03:05 IST

మందుబాబులకు మాత్రమే నిబంధనలు
ఇప్పటికే భారీగా మద్యం నిల్వలు
అధికార పార్టీకి సహకరిస్తున్న ఇంటి దొంగలు
ఒంగోలు, న్యూస్‌టుడే

పొదిలి కొత్తూరులోని ఓ మద్యం దుకాణం వద్ద బారులుతీరిన మద్యంప్రియులు

ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌(ఎన్‌డీపీఎల్‌)ను భారీగా తెచ్చి గుట్టుగా నిల్వ చేసింది. విక్రయాలపై నియంత్రణ ఉన్నప్పటికీ నామినేషన్ల పర్వంలో వైకాపా అభ్యర్థులు మద్యాన్ని ఏరుల్లా పారించారు. ప్రచారం పర్వంలోనూ పలువురు కార్యకర్తలను మత్తులో ముంచెత్తుతున్నారు. అధికారుల తనిఖీల్లో అక్కడక్కడ వెలుగు చూస్తున్న బాగోతాలే ఇందుకు నిదర్శనం.

తెరిచి ఉంచేది కేవలం గంటే...: ఉదయం 11 గంటలకు తెరుస్తున్న మద్యం దుకాణాలు గంట, గంటన్నర వ్యవధిలోనే మూసేస్తున్నా, పెద్దమొత్తంలో మద్యం వైకాపా నేతలకు లభ్యమవుతూనే ఉంది. జిల్లాలో ఒక కీలక అభ్యర్థి పెద్దఎత్తున మద్యాన్ని తీరప్రాంతంలోని సచివాలయాల్లో నిల్వ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులు కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లకు సన్నిహితులైన వ్యక్తులకు ఈపాటికే పెద్దఎత్తున నిల్వలు చేర్చినట్లు ప్రచారం. వీటికితోడు జిల్లాలో 25 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా, వాటిలో కొందరు నిర్వాహకులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఎన్నికల కోసం పెద్దమొత్తంలో దాచి ఉంచినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు కావడంతో సదరు నిల్వలపై దాడులకు అధికారులు పూర్తిస్థాయిలో సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెదారికట్ల మద్యం దుకాణం వద్ద సెబ్‌ అధికారులతో వైకాపా నాయకుల మంతనాలు

తరలిస్తూ.. దొరికిపోయారు...

కొనకనమిట్ల మండలం గొట్లగట్టు ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మూడు ద్విచక్ర వాహనాలపై మద్యం సీసాలను మంగళవారం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న మార్కాపురం సెబ్‌ ఎస్సై నాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేసి పట్టుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి ఇరవై కిలో మీటర్ల దూరంలోని పెదారికట్ల మద్యం దుకాణం వద్దకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేయకుండా శతవిధాలా ప్రయత్నించారు. దుకాణం సిబ్బందికి వత్తాసు పలికారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడంతో మిన్నకుండిపోయారు. దొరికిన మద్యం సీసాలు సుమారు 150 వరకు ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు.

తహసీల్దార్‌ పైనే  దౌర్జన్యం

పామూరు తహసీల్దార్‌ పాషా ఇటీవల మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తనిఖీలకు వెళ్లారు. అంతే అందులో పనిచేసే సిబ్బందికి కోపమొచ్చింది. తనిఖీలు చేపట్టడానికి మీరెవరంటూ అడ్డం తిరిగారు. పట్టణంలోని ఇతర దుకాణాల సిబ్బందిని, తమ బంధుగణాన్ని పిలుచుకొచ్చి తహసీల్దార్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. స్థానిక వైకాపా నాయకులు వారికి మద్దతుగా నిలిచి అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. పోలీసుల జోక్యంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. తాజాగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశాలతో మార్కాపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సదరు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నిల్వలు, స్టాకు రిజిష్టర్‌, నగదులో తేడాలు గుర్తించి దుకాణాన్ని సీజ్‌ చేశారు.

సిబ్బందికి జైలు.. నేతలకు బెయిలు...

ముండ్లమూరు మండలంలో మే 17న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. మండల కేంద్రంతో పాటు ఉల్లగల్లు పంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వచేసిన 243 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా నిల్వచేసినట్లు గుర్తించారు. బాధ్యులుగా మద్యం నిల్వచేసిన వ్యక్తితో పాటు మూడు దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు మొత్తం 11 మంది అరెస్టయ్యారు. మద్యం నిల్వచేసిన వైకాపా నేతలు మేడగం రమణారెడ్డి, షేక్‌ అంజిబాబులు మాత్రం ముందస్తు బెయిల్‌ పొంది దర్జాగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రలోభాలకు లొంగిన దుకాణాల సిబ్బంది మాత్రం జైలుపాలయ్యారు.

పశువుల కొష్టంలో వెయ్యి సీసాలు...

చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో సెబ్‌ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. స్థానికంగా ఒక వైకాపా నాయకుడికి చెందిన పశువుల కొష్టంలో గోవా నుంచి తెచ్చిన నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌(ఎన్‌డీపీఎల్‌) 1,001 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకట్రావును అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని