logo

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్‌ పన్నాగాలు

ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు.

Published : 01 May 2024 02:53 IST

నా ఎస్సీలంటూ దళితులను చంపినోళ్లకు పదవులు
రోడ్‌షోలో ఎమ్మెల్యే బాలకృష్ణ

పొగాకు దండతో బాలకృష్ణ, తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్వామి, మాగుంట, సత్య

పొదిలి, మర్రిపూడి- న్యూస్‌టుడే: ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా చేసిన అప్పు రూ. 12 లక్షల కోట్లు అయితే చేసిన ఖర్చు మాత్రం రెండున్నర లక్షల కోట్లేనని.. మిగిలిన పది లక్షల కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. గడిచిన అయిదేళ్ల వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, వ్యాపారులను ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రశ్నించేవారిపై కక్షపూరితంగా దౌర్జన్యాలు, దాడులు చేయించిందని విమర్శించారు. మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళిత డాక్టర్‌ సుధాకర్‌ను మానసికంగా హింసించి చంపింది వైకాపా ప్రభుత్వమేనని అన్నారు. దళిత యువకుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన వ్యక్తికి పదవులు కట్టబెట్టారన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ చెప్పే జగన్‌.. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని తన పేరుతో ఎలా మార్చుకున్నారని ప్రశ్నించారు. కొత్త చట్టాలు తెచ్చి మన ఆస్తి, భూములు మనవి కాకుండా చేసే పన్నాగం పన్నుతున్నారన్నారు. 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్‌.. ఇప్పుడు గులకరాయితో మరో నాటకం ఆడేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారని., తాము సినిమాల్లో మాత్రమే నటిస్తుంటామని.. జగన్‌ మాత్రం నిజ జీవితంలో నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కువరోజులు ప్లాస్టర్‌ పెట్టుకుంటే సెప్టిక్‌ అవుతుందని చెప్పేసరికి తీసేశారని, చివరకు అక్కడ దెబ్బే కనిపించ లేదని ఎద్దేవా చేశారు. అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా వెళ్లాయన్నారు. వైకాపా మ్యానిఫెస్టో ఓ మేడిపండని, పైకి బాగానే కనిపించినా లోపల అన్నీ పురుగులే ఉంటాయన్నారు. అవినీతిపరుడైన, కబ్జాదారుడైన మంత్రిని తెచ్చి కొండపి నియోజకవర్గంలో వైకాపా పోటీకి నిలిపిందని విమర్శించారు. శేషచలం అడవులు పూర్తయ్యాయి.. ఇప్పుడు నల్లమలను కొల్లగొట్టేందుకు దొంగలు వస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. తెదేపా అమలుచేయబోయే సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరించారు. కొండపి నియోజకవర్గం నుంచి తెదేపా కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ డోలా బాలావీరాంజనేయస్వామిని, ఒంగోలు ఎంపీ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరారు. రోడ్‌ షోలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య, పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని