logo

పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ

పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్‌లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు.

Published : 19 Apr 2024 03:33 IST

 పల్లెల ఉసురు తీసిన జగన్‌ సర్కారు
తెలియకుండానే నిధులు, విధుల మళ్లింపు
అయిదేళ్లుగా లాగేసుకున్నది  రూ.180 కోట్లు
విద్యుత్తు బకాయిలు చెల్లించాలని మళ్లీ ఒత్తిళ్లు

పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్‌లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. వీటిని జగన్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. సచివాలయాల పేరిట గ్రామపంచాయతీల ఊపిరి తీసే సొంత యంత్రాంగాన్ని సృష్టించింది. సచివాలయాలపై నియంత్రణాధికారాన్ని సర్పంచుల చేతుల్లోంచి దొడ్డి దారిన తీసేశారు. కొన్ని మేజర్‌ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు చాలా తక్కువ. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి ప్రభుత్వాలే చేయూతనిస్తుంటాయి. జగన్‌ ప్రభుత్వం.. ఆ పని చేయడం లేదు. సరికదా పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ సర్పంచులకు తెలియకుండానే దొంగతనంగా మళ్లించింది.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

  • ‌ ఆందోళనలు చేసినా ఉలుకేదీ..!: విద్యుత్తు బకాయిలకంటూ ఇప్పటికి జిల్లాలో రూ.180 కోట్లు కొట్టేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు కూడా పైసా లేని దుస్థితిలోకి స్థానిక సంస్థలను నెట్టేశారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేని పరిస్థితి కల్పించారు. తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులకు పైసల్లేవు. రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు వరకు అన్నిటికీ కాసుల కటకటనే మిగిల్చారు. వీధిదీపాలను వెలిగించడం నుంచి కార్మికులకు జీతాలివ్వడం వరకూ ప్రతిదీ సమస్యగా మార్చారు. నిధి వంచనపై సొంత పార్టీ సర్పంచులే ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. పల్లెల్లో ప్రగతి దీపాలను స్వహస్తాలతో కొండెక్కించారు.
  • రూ. 38 కోట్ల పైనా కన్ను...: ఇంటి పన్ను రూపంలో వచ్చిన సాధారణ నిధులనూ గత ఏడాది వదల్లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చాక కూడా తాజాగా విడుదలైన ఆర్థిక సంఘం నిధులను మరోసారి విద్యుత్తు బకాయిలకు చెల్లించాలంటూ పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రెండో విడత 15 ఆర్థిక సంఘం నిధుల కింద గత నెలలో గ్రామ పంచాయతీ ఖాతాలకు సుమారు రూ.38 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. పైగా ఏడాది తర్వాత కేటాయించారు. వీటి పైనా రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. తాజాగా వచ్చిన నిధుల్లో 15 శాతం విద్యుత్తు బకాయిలకు జమ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే బకాయిలు జమ చేయాలంటూ మండల స్థాయిలో ఈవోఆర్డీ, గ్రామ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు

ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సర్పంచులు(పాత చిత్రం)

 


జీతాలకే సాధారణ  పన్నులు సరి...

టంగుటూరు మేజర్‌ పంచాయతీ జనాభా 22 వేలు. గత మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధుల కింద రూ.3 కోట్ల మేర నిధులు పంచాయతీ ఖాతాకు జమయ్యాయి. అందులో సర్పంచికి ఎలాంటి సమాచారం లేకుండానే రూ.2.75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల కింద లాగేసుకుంది. ఇంటి పన్నుల రూపంలో సాధారణ నిధులు రూ.80 లక్షల వరకు ఏటా వస్తాయి. ప్రస్తుతం పంచాయతీలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సదరు నిధులు వారి జీతాల చెల్లింపునకే సరిపోతున్నాయి. 

మద్దిరాల మమత, సర్పంచి, టంగుటూరు


నిధులు, అధికారాలు  లాగేశారు...

పంచాయతీ ఖాతాలకు జమైన ఆర్థిక సంఘం నిధులను మాకు చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవడం దుర్మార్గం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీకి ఉన్న అధికారులు తీసేశారు. సచివాలయాలతో పాటు, గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను విద్యుత్తు బకాయిల పేరుతో మళ్లించింది. పంచాయతీల్లో చిన్నపాటి పనులు చేసేందుకు కూడా పైసలు లేవు.

 మండవ వెంకట సుబ్బయ్య, సర్పంచి, మండువవారిపాలెం, ఒంగోలు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని