logo

వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు

ఎన్నికల కోడ్‌కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది.

Updated : 20 Apr 2024 07:16 IST

ఇదీ ‘పురం’లో ఓ కీచక అధికారి తీరు

మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. అదే అధికార పార్టీ నేతలకు అనుకోని వరంలా మారింది. తమకు తొత్తుగా వ్యవహరించే ఓ అధికారిని ఏరికోరి పొరుగు జిల్లా నుంచి తెచ్చుకున్నారు. సిఫార్సులపై వచ్చిన సదరు అధికారి స్వామిభక్తి ప్రదర్శించడంలో తగ్గేదే లేదంటున్నారు. ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘనలకు సంబంధించి అధికార పార్టీ వారిపై ఎలాంటి చర్యలు, ఫిర్యాదులుండవు. అనుమతుల్లేకుండా ప్రచారం చేస్తున్నా పట్టించుకోరు. ప్రలోభ పెట్టేలా డబ్బులు పంచుతున్నారని గగ్గోలు పెట్టినా కన్నెత్తి చూడరు. మద్యం ఏరులై పారిస్తున్నా కిమ్మనరు. కేవలం రిటర్నింగ్‌ అధికారి దృష్టికి వెళ్లిన ఉల్లంఘనలపై మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పని చేస్తున్నట్లు నటిస్తుంటారు. కొన్నిసార్లు రిటర్నింగ్‌ అధికారి చెప్పినా కదలరు. ఆ విషయాల్లోనూ తప్పుదోవ పట్టిస్తుంటారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, నాయకులవి మాత్రం చిన్న విషయాలనూ భూతద్దంలో పెట్టి చూపుతూ చర్యలంటూ గగ్గోలు పెడుతుంటారు.

ఛాంబర్‌లోకి వెళ్లాలంటే వణుకు...

పట్టణానికి కీలక అధికారిగా వచ్చిన అతని తీరు ఉద్యోగుల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కార్యాలయ, సచివాలయ మహిళా ఉద్యోగులను తన ఛాంబర్‌లోకి విడివిడిగా పిలవడం.. వారితో ద్వందార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. దీంతో విధుల నిమిత్తం ఛాంబర్‌లోకి వెళ్లేందుకే హడలి పోతున్నారు. ఇతరులకు చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇంట్లో పని చేసేందుకు ఓ మహిళను పంపాలంటూ సదరు విభాగం పర్యవేక్షకుడి పైనా పదే పదే ఒత్తిడి తెస్తున్నారు. అతని చేష్టలతో విసిగిపోయిన కొందరు ఉద్యోగులు.. ఉప కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

తనిఖీల పేరుతో నొక్కుడు...

చిరువ్యాపారుల వద్దకు వెళ్లి తనిఖీల పేరుతో విలువైన ఎండు ఫలాలు ఉచితంగా తెచ్చుకోవడం, వస్త్ర దుకాణాల్లోకి వెళ్లి నగదు చెల్లించంచకుండా దుస్తులు తీసుకోవడం సర్వసాధారణమైంది. నలుగురు సచివాలయ ఉద్యోగులు, ముగ్గురు సహాయకులను తనతో తిప్పుకొంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తన వద్ద పని చేసే సహాయకుడితో ఇటీవల ఏకంగా కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. మరోవైపు లంచం లేనిదే ఏ పనీ చేయడం లేదు. ఖర్చుల పేరుతో మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి అడ్వాన్సుగా నిధులు డ్రా చేసుకునే సంప్రదాయానికి తెర లేపారు. కార్యాలయంలో విభాగాల వారీగా, సచివాలయ సిబ్బందికి కూడా లక్ష్యాలు విధించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ స్థల వివాదంలో ఉప కలెక్టర్‌ ఉత్తర్వులను అమలు చేసేందుకు కూడా బాధితుడి వద్ద నుంచి రూ.50 వేలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని