logo
Published : 24 Jun 2022 03:18 IST

జీవో 117 .. ప్రాథమిక విద్యపై పిడుగు

న్యూస్‌టుడే, సోంపేట

* సోంపేట మండలం గొనకపాడు ఉన్నత పాఠశాలలో 440 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత విధానం ప్రకారం ఇక్కడ 20 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొత్త జీవో మేరకు ఇక్కడ ఏడు పోస్టులు మిగులు చూపించాల్సి వస్తోంది.


* సోంపేట మండలం గొల్లగండి, బుషాభద్ర, గొల్లూరు, రామక్రిష్ణాపురం, రుషికుద్ద ప్రాథమికోన్నత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ చర్యలతో స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు ఉండవు. దీంతో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు కూడా ఎస్జీటీలతోనే బోధన సాగించాల్సి ఉంటుంది. గణితం, సైన్సు అంశాల బోధనలో వీరు ఏమేరకు న్యాయం చేయగలుగుతారు.


* కవిటి మండలం బొరివంక ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు నిర్వహిస్తున్నారు. కొత్త ఉత్తర్వుల మేరకు ఏదో ఒక మాధ్యమం మాత్రమే చదవాలి. 460 మందికి పైగా విద్యార్ధులుండగా 23 మంది ఉపాధ్యాయులున్నారు. ఎనిమిది పోస్టులు మిగులు చూపాలి. కర్రివానిపాలెం, ఇద్దివానిపాలెం, దూగానపుట్టుగ యూపీ స్కూళ్లకు చెందిన 80 నుంచి 90 మంది విద్యార్థులు ఇక్కడ చేరుతారు. కొత్తగా చేరే పిల్లలను పరిగణలోకి తీసుకోకుండా హేతుబద్ధీకరణ చేపడుతుండడంతో బోధన, ఇతర నిర్వహణల పరిస్థితి భారం కానుంది.

ప్రాథమిక విద్యపై కొత్త జీవో 117 తీవ్ర ప్రభావం చూపనుంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి, ఒకే మాధ]్యమం, ఇతర అంశాలు పరిశీలిస్తే జిల్లాలో భారీగా పోస్టులు మిగులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ఒకటి, రెండు తరగతులకు ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలే మిగలనున్నాయి. ‘ప్రాథమిక’ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొనగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏదో ఒక మాధ్యమంతో సరిపెట్టుకోవాల్సి రావడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదువులపై తీవ్ర ప్రభావం
ప్రాథమిక పాఠశాలల పరంగా 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. దీంతో ఒక్కో మండలంలో 40 నుంచి 70 వరకు ఉపాధ్యాయుల మిగులు ఏర్పడనుంది. వీరిని కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసినా ఇంకా మిగులే కన్పించే అవకాశముంది. ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామన్న హామీకి దిక్కు లేకపోగా ప్రాథమికోన్నత తరగతులకూ సబ్జెక్టు టీచర్లనూ నియమించే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని వారంటున్నారు.


తరగతికి ఒకరుండాలి
-నగరి శరత్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ

ప్రాథమిక బడికి హేతుబద్దీకరణ సరికాదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండకపోతే నాణ్యతగల చదువులెలా సాధ్యం. మార్పు మెరుగైన విద్య అందించేలా ఉండాలి. ఉన్నవాటిని తీసేయడం కాదు.


ప్రాథమిక విద్యావ్యవస్థ నాశనం
-లండ బాబూరావు, జిల్లా సహధ్యక్షుడు, యూటీఎఫ్‌

ఈ విధానంతో ప్రాథమిక విద్యావ్యవస్థ నాశనమవుతుంది. ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతుంది. కొత్తగా డీఎస్సీ వచ్చే అవకాశం లేక నిరుద్యోగులు పెరుగుతారు. గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో ఉంచాలి.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని