logo

స్పీకర్‌ తమ్మినేని కోటకు బీటలు!

ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వేల కుంటుంబాలకు పైగా వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కువగా చేరారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనా విధానాలు నచ్చకపోవడం, గ్రామ స్థాయిలో అభివృద్ధికి వీలులేకపోవడం, ఐదేళ్ల పాటు సభాపతి పట్టించుకోలేదనే అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది.

Updated : 18 Apr 2024 10:07 IST

 వైకాపాను వీడుతున్న అనుచరులు

తెదేపాలో భారీగా పెరుగుతున్న చేరికలు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం: శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గవ్యాప్తంగా అసమ్మతి స్వరం పెరుగుతుండటంతో శ్రేణులు గుంభనంగా ఉన్నాయి. ఆయన ప్రచార కార్యక్రమాలకు ప్రజాదరణ లేకపోవడం, మండల, గ్రామస్థాయి వైకాపా నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.  తిరుగుబాటు చేస్తున్న నేతలను దారికి తెచ్చుకోవాలని చూసినా ఫలితం లేకపోయింది. అభివద్ధికి తోడ్పడలేదని పలువురు సర్పంచులు, కీలక నేతలు ఇటీవల నిర్వహించిన  సమావేశంలో ఆయన ఎదుటే తేల్చి చెప్పారు. ‘మీ వెంట నడవలేం..’ అని స్పష్టం చేసి వైకాపాను వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తమకు అన్యాయం చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సువ్వారి గాంధీ,  జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ సువర్ణ రాజీనామా చేశారు.  

వైకాపాను వీడి తెదేపాలోకి చేరిన వైకాపా నాయకులు బత్తుల లక్ష్మణరావు, కార్యకర్తలు

 చేరినవారిలో సర్పంచులే అధికం

  • ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వేల కుంటుంబాలకు పైగా వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కువగా చేరారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనా విధానాలు నచ్చకపోవడం, గ్రామ స్థాయిలో అభివృద్ధికి వీలులేకపోవడం, ఐదేళ్ల పాటు సభాపతి పట్టించుకోలేదనే అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది. తమ్మినేని సీతారాం వ్యవహారశైలి, అవినీతి వ్యవహారాలు, అభివృద్ధికి సహకరించరని తెలిసినా ఆయనకే టికెట్‌ ఇవ్వడం నచ్చనివారు వర్గాలుగా ఏర్పడ్డారు. సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. సభాపతి ముఖ్య అనుచరులు గాంధీ వెంట ప్రచార కార్యక్రమాల్లో మద్దతుగా తిరుగుతున్నారు. ఆమదాలవలస మండలానికి చెందిన వైకాపా సీనియర్‌ నేత కోట గోవిందరావు ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్తబ్దుగా ఉన్నారు. ఆ పార్టీ జోనల్‌ ప్రచార విభాగ కార్యదర్శి చింతాడ రవికుమార్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తమ్మినేనికి వ్యతిరేకంగా ఉన్న వారిని జిల్లాలో ఆ పార్టీ సీనియర్‌ నేతలే ప్రోత్సహిస్తున్నారని సమాచారం.  
  •  బూర్జ మండలం అయ్యవారిపేట సర్పంచి ఇప్పిలి అంభుజాక్షి, శిమన్న వారి అనుచరులు సుమారు 60 మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఇదే మండలంలోని లక్కుపురం, డొంకలపర్త, తోటవాడ, చీడివలస నేతలు వైకాపాను వీడి తెదేపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
  • ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన వైకాపా సీనియర్‌ నాయకుడు బత్తుల లక్ష్మణరావు, ఆయన అనుచరులుగా ఉన్న 63 కుటుంబాలు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరారు. ఆమదాలవలస వైకాపా మండల మహిళా అధ్యక్షురాలు బత్తుల సరిత పార్టీ సభ్యత్వానికి, తన అధ్యక్ష పదవికి పార్టీకీ రాజీనామా చేశారు. బుధవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి తెదేపాలో చేరారు. బెలమాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి సీపాన వెంకటరమణ, ఆయన అనుచరులతో కలిసి 16 కుటుంబాలు, పురపాలక సంఘంలోని 23వ వార్డు లక్ష్ముడుపేటకు చెందిన దుంపల గోవింద, వారి అనుచరులు సుమారు 34 కుటుంబాలు తెదేపా కండువా వేసుకున్నాయి.  
  •  సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిల్లి అప్పలనాయుడు కుమారుడు లక్ష్మణరావు, ఆయన అనుచరులు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. మతలబుపేటకు చెందిన బగాది ధనుంజయ్‌, గూనపాడు మాజీ సర్పంచి, సిందువాడ ఉప సర్పంచి లంకలపల్లి దుర్గ, ఐదుగురు వార్డు సభ్యులు, గోనెపాడు సర్పంచి బిర్లంగి అమ్మాయమ్మ, రొట్టవలస పంచాయతీకి చెందిన ఐదుగురు వార్డు సభ్యులు తెదేపాలో చేరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని