logo

ఖాకీలకు జగనన్న కుచ్చుటోపీ

ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Published : 30 Apr 2024 05:45 IST

అమలుకు నోచుకోని వారాంతపు సెలవుల హామీ
పోలీసుల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం
న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం


జగన్‌ తీరు ఇలా..  

ప్రతి పక్షనేతగా..

అధికారంలోకి రాగానే  పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారాంతపు సెలవు అమలు చేస్తాం. అండగా ఉంటాం. అని గొప్పలు చెప్పారు.


ముఖ్యమంత్రి హోదాలో..

నిత్యం బందోబస్తు విధులతో క్షణం తీరిక లేకుండా చేశారు. వైకాపా నాయకులు చెప్పిందే చేయాలంటూ సంకెళ్లు వేశారు. వారి సంక్షేమాన్ని మరిచి ఇవ్వాల్సిన బకాయిలు  ఊసెత్తకుండా వ్యవహరిస్తున్నారు.


ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడంతో పాటు బకాయిలను చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో 1,550 మందికిపైగా పోలీసు సిబ్బంది, 717 మంది వరకు హోంగార్డులు ఉన్నారు. వీరంతా బందోబస్తులు, రాత్రి వేళ బీట్లు, ట్రాఫిక్‌, రోప్‌ పార్టీలు, గన్‌మెన్లు, డ్రైవర్లు, డాగ్‌ స్క్వాడ్‌ ఇలా పలు రకాలు విధులు నిర్వర్తిస్తుంటారు. 24 గంటల పాటు ఉద్యోగం చేస్తుంటారు. వీరికి 2019 ఎన్నికల ముందు వారాంతపు సెలవులు ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు అమలు చేశారు. తర్వాత వారాంతపు సెలవులు ఇవ్వడం మానేశారు. వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని చూసేందుకు, కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసేందుకు వీలు లేకుండా చేసేశారు.

బకాయిల ఊసు మరిచారు.. గతంలో పోలీసులకు ఆదివారం, పండగ రోజుల్లో విధులకు హాజరైతే.. ఏటా రెండు దఫాలుగా సరెండర్‌ లీవులకు నగదు మంజూరు చేసేవారు. వాటి విషయంలో జాప్యం చేశారు. పీఆర్సీ బకాయిలు ఇవ్వలేదు. బందోబస్తు, ఇతర ప్రాంతాల్లో విధులకు వెళ్లినప్పుడు చెల్లించాల్సిన రవాణా భత్యం కూడా ఏడాదిగా  ఇవ్వడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పనిభారంతో సతమతం..

అయిదేళ్లుగా కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుళ్ల నియామకాలు జరపలేదు. దీంతో జిల్లాలో స్టేషన్లవారీగా సిబ్బంది కొరత ఏర్పడింది. ఉన్నవారిపై పని భారం పెరిగింది. ఫలితంగా సిబ్బంది రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఇతర రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో పోలీసులకు శాఖాపరంగా వైద్య పరీక్షలు చేయిస్తే.. చాలా మంది వరకు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది.


కష్టమే కానీ తప్పట్లేదు..
- కెల్ల అప్పన్న, అధ్యక్షుడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం

పోలీసులు కష్టాలను దిగమింగి ఉద్యోగం చేస్తున్నారు. వరుస బందోబస్తులతో పనిభారం పెరుగుతోంది. వారాంతపు సెలవే కాదు సాధారణ సెలవులూ లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కష్టంగానే ఉంటున్నా తప్పట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని