logo

వీధి వీధినా.. విజయ్‌ స్ఫూర్తి!

చెన్నైలోని ఓ తెలుగు యువకుడు అరుదైన ఘనతను సాధించారు. క్రీడాకారుడు అన్నిరకాల వాతావరణాలకు, వివిధ ప్రాంతాల ప్రభావాలను తట్టుకుంటేనే ప్రతిభ చాటగలడని నిరూపించేందుకు నగరంలో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ప్రజల్ని ఫిట్‌నెస్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ యువకుడి పేరు.. విజయ్‌ బొడ్డుపల్లి.

Published : 19 Aug 2022 02:14 IST

 చెన్నైలో 25 వేల కి.మీ. ప్రయాణం
 సైక్లింగ్‌, నడక, పరుగు కలగలిపి ఘనత
 3 ‘లిమ్కా’ రికార్డులతో తెలుగు వ్యక్తి ప్రత్యేకత
ఈనాడు, చెన్నై

నేపాల్‌ క్రికెట్‌ ఫ్రాంచై జట్టులో విజయ్‌ బొడ్డుపల్లి (వృత్తంలో), జట్టులో షాహిద్‌ ఆఫ్రిదీ తదితరులు

చెన్నైలోని ఓ తెలుగు యువకుడు అరుదైన ఘనతను సాధించారు. క్రీడాకారుడు అన్నిరకాల వాతావరణాలకు, వివిధ ప్రాంతాల ప్రభావాలను తట్టుకుంటేనే ప్రతిభ చాటగలడని నిరూపించేందుకు నగరంలో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ప్రజల్ని ఫిట్‌నెస్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ యువకుడి పేరు.. విజయ్‌ బొడ్డుపల్లి. ఇంతకీ ఏం చేశారో.. ఆయన మాటల్లోనే.. ‘‘క్రీడాకారుడంటే ఆటకే కాదు, తన చుట్టూ ఉన్న పరిస్థితులనూ ఎదుర్కోవాలి. అవన్నీ గెలిచినప్పుడే అసలైన విజయం. వారిదే అసలైన ఫిట్‌నెస్‌. క్రీడాకారులు ఈ నిజం తెలుసుకోకుండా విఫలం అవుతున్నారనేవారు చాలామందే. ఈ స్థితిని నేను సవాల్‌గా తీసుకున్నాను. చెన్నై విభిన్న నగరం. ఇక్కడి కార్పొరేషన్‌లో ఒక్కో జోన్‌ ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్నిచోట్ల పరిశ్రమలు, ఇంకొన్నిచోట్ల గ్రామీణ వాతావరణం, ఇంకా.. జాతీయ రహదారులు.. కలిగి ఉంటుంది. ప్రతి వాడలో తిరిగేలా ప్రణాళిక వేసుకున్నాను. ప్రజల్లో అవగాహనతోపాటు నా కార్యక్రమం ప్రత్యేకంగా ఉండేలా.. కొంత దూరం సైక్లింగ్‌, మరికొంతదూరం పరుగు, ఇంకొంతదూరం నడక.. ఇలా మూడురకాలుగా నగరవ్యాప్తంగా తిరిగాను. 2017లో మొదలైన ఈ ప్రయత్నం తాజాగా జులై 25న ముగిసింది. మొత్తం 25 వేల కి.మీ., కంటోన్మెంట్‌తోపాటు చెన్నైలోని 15 జోన్లలోనూ తిరిగాను. ఇదో అరుదైన ఘనతగా మారింది.
అనుభవాలతో పుస్తకం..
మాది మునుపటి ప్రకాశం జిల్లా చీరాల. ఇప్పుడిది బాపట్ల జిల్లాలోకి వెళ్లింది. రెండు తరాలకు ముందే మా కుటుంబం ఇక్కడికొచ్చింది. క్రికెటర్‌, అథ్లెట్‌, పలు రికార్డుల విజేతగా ఎన్నో అనుభవాలు నాకున్నాయి. ఇంకెన్నో ఎదురుదెబ్బలు తిన్నాను కూడా. ఒక క్రీడాకారుడికి ఆటతో పాటు వాతావరణం, ఇతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేతత్వమే అత్యంత ప్రధానం. ఇవి అనుభవంతో తప్పితే ఎవరూ చెప్పరు. భావిభారత క్రీడాకారులకు నా జీవితం ఓ పాఠం కావాలనే ఉద్దేశంతో ఎన్నో రికార్డులు సాధించాను. ప్రతి మలుపులో నేను నేర్చుకున్న పాఠాల్ని ఓ పుస్తకంగా తెస్తున్నాను. త్వరలో ప్రచురితం కానుంది.
నేపాల్‌ లీగ్‌లో కీలక బాధ్యతలు
భారత క్రికెట్‌ జట్టుకు ఆడాలనుకున్నా ఆ కల తీరలేదు. కానీ క్రికెట్‌కు సేవ చేసే అవకాశం దక్కింది. ఇక్కడ ఐపీఎల్‌లాగా నేపాల్‌లో సీజనల్‌గా ఎవరెస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరుగుతుంది. ఇక్కడి ప్రాంఛైజీ జట్టులో స్ట్రెంతెనింగ్‌ అండ్‌ కండీషనర్‌ ట్రైనర్‌గా, క్రీడాకారుల గణాంకాల  విశ్లేషకుడిగా పనిచేస్తున్నాను. ఆ జట్టులో స్టార్‌ ఆటగాళ్లు షాహిద్‌ అఫ్రిదీ (పాకిస్తాన్‌), రహ్మనుల్లాహ్‌ గుర్బాజ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌), సందీప్‌ (నేపాల్‌), ర్యాన్‌ బుర్ల్‌ (జింబాబ్వే) లాంటివారున్నారు. క్రీడాకారుల్లో ఆటతోపాటు ఇతర స్థితిగతుల్ని అర్థం చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చెన్నైలోనే ఈ ఏడాది ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ స్పోర్ట్స్‌ ఫర్మామెన్స్‌’ను స్థాపించాను.
రికార్డుల పరుగు
క్రికెటర్‌ అవ్వాలని తొలుత లీగ్‌ మ్యాచుల్లో ఆడాను. 2007 నుంచి మాల్దీవులు, యూకే, జింబాబ్వే, శ్రీలంక, కెన్యాలో ఆడటంతోపాటు హైదరాబాద్‌ డివిజన్‌ -1కి కూడా ప్రాతినిధ్యం వహించాను. 2014లో కెన్యాలో జరిగిన మ్యాచుల్లో గాయాలపాలవడం, ఆ తర్వాత వరస గాయాలు వేధించడం నా జీవితంలో బాధాకర విషయమైంది. వారి ప్రమాణాలకు తగ్గట్లు ఫిట్‌గా లేకపోవడంతో తర్వాత ఆడే అవకాశం చేజారింది. అప్పుడు నా జీవితం మరో మలుపు తిరిగింది. ఆటగాడిగా సంపూర్ణుడిని కాకపోయినా.. సామాజిక స్ఫూర్తిలో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. 2016, 2017లో చేసిన రికార్డు ఫీట్‌లకు 2017, 2018, 2019లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సాధించాను. ప్రాథమిక చికిత్స ప్రాధాన్యాన్ని తెలుపుతూ 21 రోజులపాటు నిత్యం 21.1 కి.మీ. పరుగు తొలిరికార్డుగా మారింది. భోపాల్‌లో అవయవదానంపై 10 కి.మీ. దూరం వెనక్కి పరిగెత్తడంలో రెండో రికార్డు వరించింది. 2017-18లో ఒకే ఏడాదిలో ఏకంగా 17 హాఫ్‌ మారథాన్‌ల్లో పాల్గొన్న వ్యక్తిగా మూడో రికార్డు సొంతమైంది. దీనికి తోడు రెండు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులు, పంజాబ్‌లో బ్లడ్‌క్యాన్సర్‌ రోగులకు బ్లడ్‌ స్టెమ్‌సెల్స్‌ దాతలు పెరిగేలా 7 నగరాల్ని 800కి.మీ. మేర చుడుతూ చేపట్టిన సైక్లింగ్‌ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డును తెచ్చిపెట్టింది. స్పాన్సర్లు సరిగా దొరక్క మరిన్ని రికార్డులు చేజారిపోయాయి. చెన్నై నగరంలో అన్ని ప్రాంతాల పిన్‌కోడ్‌లను కలుపుతూ పలురకాల ఫిట్‌నెస్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రణాళిక ఉంది.’’

పరుగులో రికార్డు సాధించిన వేళ..
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని